Telugu Global
National

నీట్‌ రీ–టెస్ట్‌ ఫలితాల్లో వైవిధ్యం

1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం ఆ పరిస్థితికి దారితీసిందని గుర్తించిన సుప్రీంకోర్టు.. వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో భారీ వ్యత్యాసం కనిపించడం గమనార్హం.

నీట్‌ రీ–టెస్ట్‌ ఫలితాల్లో వైవిధ్యం
X

నీట్‌ యూజీ- 2024 పరీక్షలో అక్రమాలు చోటుచేసుకోవడంతో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ఇటీవల మళ్లీ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. మొత్తం 1,563 మందిలో 813 మంది మాత్రమే పరీక్షకు హాజరయ్యారు. ఫలితాల అనంతరం సదరు కేంద్రంలో వచ్చిన అత్యధిక స్కోరు 682గా ఉండటం గమనార్హం. అది కూడా ఒక్క విద్యార్థికే వచ్చింది. 13 మంది విద్యార్థులకు 600 పైగా మార్కులు వచ్చాయి. తొలుత వెల్లడైన ఫలితాలకు, వీటికి మధ్య భారీ వ్యత్యాసం కనిపించడం గమనార్హం.

తొలుత ప్రకటించిన ఫలితాల్లో ఎలా వచ్చాయంటే..

జూన్‌ 4న వెలువడిన నీట్‌ ఫలితాల్లో దేశవ్యాప్తంగా 67 మందికి ఫస్ట్‌ ర్యాంక్‌ వచ్చింది. అందులో ఒకే కేంద్రంలో పరీక్ష రాసిన ఆరుగురికి 720కి 720 మార్కులు వచ్చాయి. ఆ ఫలితాలపై దేశవ్యాప్తంగా తీవ్ర అనుమానాలు వ్యక్తమయ్యాయి. 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం ఆ పరిస్థితికి దారితీసిందని గుర్తించిన సుప్రీంకోర్టు.. వారికి మళ్లీ పరీక్ష నిర్వహించాలని ఆదేశించింది. ఈ నేపథ్యంలో నిర్వహించిన పరీక్ష ఫలితాల్లో భారీ వ్యత్యాసం కనిపించడం గమనార్హం.

రీటెస్ట్‌ తర్వాత నీట్‌ యూజీ పరీక్ష రాసిన అందరి ర్యాంకులు మారినట్లు ఫలితాల తర్వాత ఎన్టీఏ వెల్లడించింది. ఇదిలా ఉండగా.. నీట్‌ పరీక్షలో పేపర్‌ లీక్‌ జరిగిన ఆరోపణలపై దర్యాప్తు జరుగుతోంది. మరోపక్క ఈ అవకతవకలపై సుప్రీంకోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలోనే విచారణలో భాగంగా మిగతా కేంద్రాలతో పోలిస్తే అనుమానిత పరీక్ష కేంద్రాల్లో రాసిన వారికి ఎక్కువ మార్కులు వచ్చాయా.. లేదా అని తెలుసుకోవడానికి కేంద్రాల వారీగా ఫలితాలు అందించాలని ధర్మాసనం తాజాగా ఎన్టీఏను ఆదేశించింది. ఆ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్టీఏ) శనివారం ఆ వివరాలను వెల్లడించింది.

First Published:  20 July 2024 7:46 PM IST
Next Story