తెలంగాణలోనే కొనసాగే అవకాశమివ్వండి
క్యాట్ ను ఆశ్రయించిన ముగ్గురు ఐఏఎస్ అధికారులు
తెలంగాణలోనే కొనసాగే అవకాశం ఇవ్వాలని పలువురు ఐఏఎస్ అధికారులు సెంట్రల్ అడ్మినిస్ట్రేటివ్ ట్రిబ్యునల్ ను ఆశ్రయించారు. వాకటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి కాటా సోమవారం క్యాట్ లో పిటిషన్ లు దాఖలు చేశారు. ఏపీలో కొనసాగేందుకు తనకు చాన్స్ ఇవ్వాలని ఐఏఎస్ అధికారి సృజన క్యాట్ లో అప్పీల్ చేశారు. ఏపీ క్యాడర్ కు చెందిన తమను ఈనెల 16లోగా తెలంగాణలో రిలీవ్ అయి ఏపీలో రిపోర్ట్ చేయాలని డీవోపీటీ ఆదేశించిందని, ఆ ఆదేశాలను రద్దు చేయాలని తమ పిటిషన్ లో కోరారు. సృజన సైతం అలాంటి విజ్ఞప్తినే చేశారు. నలుగురు ఐఏఎస్ అధికారులు వేర్వేరుగా ఈ పిటిషన్ లు దాఖలు చేశారు. రిపోర్ట్ చేయాల్సిన సమయం దగ్గర పడటంతో మంగళవారమే క్యాట్ వీరి పిటిషన్లను విచారించనునంది. డీపీవోటీ ఆదేశాలపై క్యాట్ మధ్యంతర ఉత్తర్వులు ఇస్తుందా.. విచారణను మరో తేదీకి వాయిదా వేస్తుందా అనే ఉత్కంఠ ఐఏఎస్ లతో పాటు పాటు రెండు రాష్ట్రాల అడ్మినిస్ట్రేటివ్ సర్కిల్స్ లో నెలకొంది. ఒకవేళ క్యాట్ వారికి ఊరటనివ్వకపోతే బుధవారం ఏపీలో వాకాటి కరుణ, వాణిప్రసాద్, ఆమ్రపాలి, తెలంగాణ సృజన రిపోర్ట్ చేయకతప్పని పరిస్థితి. డీవోపీటీ ఆదేశాల నేపథ్యంలో తెలంగాణలో పని చేస్తున్న ఏపీ క్యాడర్ ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, రోనాల్డ్ రోస్, ఆమ్రపాలి సోమవారం సెక్రటేరియట్ లో సీఎస్ శాంతికుమారితో సమావేశమయ్యారు.