Telugu Global
National

ఈ పాట తర్వాత ఎవరూ చప్పట్లు కొట్టవద్దని కోరిన శ్రేయా ఘోషల్‌

దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై భావోద్వేగ గీతాన్ని పాడిన ప్రముఖ సింగర్‌

ఈ పాట తర్వాత ఎవరూ చప్పట్లు కొట్టవద్దని  కోరిన శ్రేయా ఘోషల్‌
X

బెంగాల్‌లో జూనియర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటన నేపథ్యంలో ప్రముఖ సింగర్‌ శ్రేయా ఘోషల్‌ గతంలో తన కాన్సర్ట్‌ను వాయిదా వేసుకున్న విషయం విదితమే. తాజాగా ఆ కాన్సర్ట్‌ను ఆమె నిర్వహించారు. 'ఆల్‌ హార్ట్స్‌ టూర్‌'లో భాగంగా కోల్‌కతాలోని నేతాజీ ఇండోర్‌ స్టేడియంలో ఈ కార్యక్రమం జరిగింది. ఇందులో ఆమె దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఆర్జీ కర్‌ డాక్టర్‌ హత్యాచార ఘటనపై భావోద్వేగ గీతాన్ని పాడారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారింది.

'గాయపడిన నా శరీరం బాధను ఈరోజు మీరు వింటున్నారు' అంటూ సాగే పాటను శ్రేయా ఉద్వేగభరితంగా ఆలపించారు. ఇలాంటి ఘటనల్లో బాధితులు ఎదుర్కొనే బాధ, వారి ఆవేదనను ఆమె ఈ పాట రూపంలో వినిపించారు. ఈ పాటకు ఎవరూ చప్పట్లు కొట్టవద్దని ఆమె ఆడియన్స్‌ను కోరారు. శ్రేయా పాట పాడటం పూర్తయ్యాక స్టేడియం మొత్తం 'వీ వాంట్‌ జస్టిస్‌' నినాదాలతో హోరెత్తింది.

శ్రేయ ప్రోగ్రామ్‌పై ఆమెను ప్రశంసిస్తూ తృణమూల్‌ నేత కునాల్‌ ఘోష్‌ పోస్ట్‌ పెట్టారు. ఈ ఘటనపై ఆమె ఎంతో బాధపడ్డారు. కార్యక్రమాన్ని వాయిదా వేసుకున్నారు. ఇప్పుడు మహిళల భద్రతపై గీతాన్ని ఆలపించి అందరి హృదయాలను కదిలించారు. హత్యాచార ఘటనలపై నిరసనలు అవసరం' అని పేర్కొన్నారు. మరోవైపు ఆర్జీ కర్‌ హాస్పటల్‌ ఘటనపై శ్రేయా ఘోషల్‌ గతంలో స్పందించారు. దీని గురించి తెలిసిన తర్వాత తన వెన్నులో వణుకు పుట్టిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇది క్రూరమైన చర్య అని.. తనపై తీవ్ర ప్రభావం చూపెట్టిందన్నారు.

ఈ ఘటనపై గాయకుడు అర్జిత్‌ సింగ్‌ ఓ బెంగాలీ పాటతో నిరసనలకు తన మద్దతు తెలిపారు. బాధితురాలికి న్యాయం చేయాలని కోరారు. న్యాయం కోసం ఆవేదనతో ఈ పాట పాడుతున్నాను. మౌనంగా బాధపడుతున్న అసంఖ్యాక మహిళల కోసం.. మార్పును కోరుకునే వారికోసం ఈ గీతం. మరణించిన డాక్టర్‌ ధైర్యాన్ని కీర్తిస్తున్నా. భయంకరమైన హింసను ఎదుర్కొంటున్న మహిళలందరికీ సంఘీభావం తెలుపుతున్నా' అంటూ పాడారు.

First Published:  21 Oct 2024 9:09 AM IST
Next Story