Telugu Global
National

గరిబీ హఠావో వాళ్లకు నినాదం.. మేం నిజం చేస్తున్నాం

రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో ప్రధాని నరేంద్రమోదీ

గరిబీ హఠావో వాళ్లకు నినాదం.. మేం నిజం చేస్తున్నాం
X

గరిబీ హఠావో అని గత ప్రభుత్వాలు నినాదాలు మాత్రమే చేశాయని, తాము నిజం చేస్తున్నామని ప్రధాని నరేంద్రమోదీ అన్నారు. పదేళ్లలో పేదరికం నుంచి 25 కోట్ల మందిని బయటకు తెచ్చామని తెలిపారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చలో భాగంగా మంగళవారం లోక్‌సభలో ప్రధాని మాట్లాడారు. రాష్ట్రపతి ప్రసంగం తమలో ఆత్మవిశ్వాసం నింపిందని అన్నారు. ఎన్‌డీఏ ప్రభుత్వాన్ని మూడోసారి ఎన్నుకున్న దేశ ప్రజలకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. మధ్య తరగతి ప్రజల ఆకాంక్షలను నెరవేరుస్తున్నామని.. వికసిత్‌ భారత్‌ అనేది తమ లక్ష్యమన్నారు. కొందరు బిల్డింగులు కట్టుకోవడంలో నిమగ్నమైతే తాము ప్రతి ఇంటికీ నల్లా నీళ్లు ఇవ్వడంపైనే దృష్టి పెట్టామన్నారు. దేశంలోని 12 కోట్ల మందికిపైగా పేదల ఇండ్లల్లో మరుగుదొడ్లు నిర్మించామన్నారు. కొందరు నాయకులు పేదల గుడిసెల వద్ద వారితో ఫొటోలు దిగేందుకే ఉత్సాహం చూపిస్తారని.. వాళ్లకు మంచి చేయడంపై మాత్రం వాళ్లకు చిత్తశుద్ధి ఉండదన్నారు. ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామాలకు 16 పైసలే చేరుతున్నాయని గతంలో ఒక ప్రధాని వాపోయారని రాజీవ్‌ గాంధీని ఉద్దేశించి కామెంట్‌ చేశారు. అప్పట్లో ఢిల్లీ ప్రభుత్వాల పరిస్థితి అలా ఉండేదని.. ఇప్పుడు ఢిల్లీ నుంచి రూపాయి పంపితే గ్రామాలకు ఆ రూపాయి చేరుతుందన్నారు. డైరెక్ట్‌ ట్రాన్స్‌ఫర్‌ సిస్టంతో ప్రజలకే నేరుగా నగదు అందుతుందని తెలిపారు.

డిజిటల్‌ టెక్నాలజీతో బ్యాంకుల్లోని పది కోట్ల నకిలీ ఎకౌంట్లను గుర్తించామన్నారు. ఇథనాల్‌ బ్లెండింగ్‌ ద్వారా విదేశీ మాదకద్రవ్యాన్ని ఆదా చేశామన్నారు. ఇదివరకు ఎక్కడ చూసినా రూ.లక్షల కోట్ల అవినీతి, అక్రమాలు అని వార్తలు వచ్చేవని.. పదేళ్లుగా తమ ప్రభుత్వంపై అలాంటి ఆరోపణలే లేవన్నారు. కొందరు పేదరికం గురించి డైలాగులు కొడుతూ శీష్‌ మహల్‌ నిర్మాణం కోసం అవినీతి చేస్తారని ఆప్‌ చీఫ్‌ కేజ్రీవాల్‌ కు చురకలంటించారు. పదేళ్లుగా అవినీతికి ఆస్కారం లేకుండా తమ పాలన సాగిస్తుండటంతో పేదలకు, దేశ ప్రజలకు మంచి జరిగిందన్నారు. ఆయుష్మాన్‌ భారత్‌, జన ఔషధి కేంద్రాల ఏర్పాటుతో వివిధ ఆరోగ్య సమస్యలతో బాధపడే వారికి మంచి జరిగిందన్నారు. ప్రజల డబ్బుతో తాము అద్దాల మేడలు నిర్మించలేదని.. ప్రతి రూపాయిని ప్రజల మంచి కోసమే వినియోగించామన్నారు. వరల్డ్‌ గేమింగ్‌ క్యాపిటల్‌ గా భారత్‌ రూపుదిద్దుకుంటోందన్నారు. తాము అధికారంలోకి రావడానికి ముందు రూ.400 ఉన్న ఎల్‌ఈడీ బల్బు ధర ఇప్పుడు రూ.40కి తగ్గిందన్నారు. కేవలం ఎల్‌ఈడీ బల్బుల కొనుగోలుతోనే దేశ ప్రజలు రూ.20 వేల కోట్లు ఆదా చేసుకున్నారని చెప్పారు. ప్రజలకు మంచి చేసేలా పాలన అందిస్తుండటంతోనే మళ్లీ తమనే గెలిపించారన్నారు. హర్యానాలో మూడోసారి అధికారంలోకి వచ్చామని, మహారాష్ట్రలో అధికారాన్ని నిలబెట్టుకున్నామని చెప్పారు.

First Published:  4 Feb 2025 8:25 PM IST
Next Story