దివికేగిన మన్మోహనుడు
తీవ్ర అనారోగ్యంతో కన్నుమూసిన మాజీ ప్రధాని
మాజీ ప్రధాని, సుప్రసిద్ధ ఆర్థికవేత్త డాక్టర్ మన్మోహన్ సింగ్ ఇకలేరు. తీవ్ర అనారోగ్యంతో ఎయిమ్స్ ఆస్పత్రిలో చేరిన మన్మోహన్ సింగ్ గురువారం రాత్రి తుది శ్వాస విడిచారు. రాబర్ట్ వాద్రా మన్మోహన్ సింగ్ మరణించారనే వార్తను తన 'ఎక్స్' ఎకౌంట్‌లో పోస్ట్ చేశారు.కాంగ్రెస్ పార్టీ తన అధికారిక ట్విట్టర్ ఎకౌంట్‌లోనూ మన్మోహన్ సింగ్ మరణించారని, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని కోరుతూ పోస్ట్ చేసింది. ఆయన రాత్రి 9.51 గంటలకు తుది శ్వాస విడిచారని ఎయిమ్స్ ప్రొఫెసర్ డాక్టర్ రిమా దాదా ఒక ప్రకటన ద్వారా వెల్లడించారు. మన్మోహన్ సింగ్ మరణించారనే వార్త తెలియగానే కర్నాటకలోని బెలగావిలో జరుగుతున్న సీడబ్ల్యూసీ సమావేశంలో పాల్గొంటున్న రాహుల్ గాంధీ, మల్లికార్జున ఖర్గే ఢిల్లీకి తిరుగు ప్రయాణమయ్యారు. బెలగావిలో శుక్రవారం కాంగ్రెస్ పార్టీ తలపెట్టిన ర్యాలీని కూడా రద్దు చేశారు. ఆర్‌బీఐ గవర్నర్ గా, జేఎన్‌యూలో ఎకనామిక్స్ ప్రొఫెసర్‌గా డాక్టర్ మన్మోహన్ సింగ్ సేవలను గుర్తించిన పీవీ నర్సింహారావు తన కేబినెట్‌లో ఆర్థిక శాఖ మంత్రిగా అవకాశం ఇచ్చారు. 1991లో ఆర్థిక మంత్రిగా ఆయన ప్రవేశ పెట్టిన ఆర్థిక సంస్కరణలు దేశగతినే మార్చేశాయి. 2004, 2009లో ఆయన రెండు పర్యాయాలు దేశ ప్రధానిగా సేవలందించారు.
ప్రస్తుత పాకిస్థాన్‌లోని పంజాబ్ రాష్ట్రంలో గల చక్వాల్ లో 1932 సెప్టెంబర్ 26న మన్మోహన్ సింగ్ జన్మించారు. 1958లో ఆయన గురుశరణ్ కౌర్ ను వివాహం చేసుకున్నారు. వారికి ముగ్గురు కుమార్తెలు. మన్మోహన్ సింగ్ పంజాబ్ యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్స్ డిగ్రీ, ఎకనామిక్స్‌లో మాస్టర్స్ పూర్తి చేశారు. ఆ తర్వాత కేంబ్రిడ్జి నుంచి బ్యాచ్‌లర్స్ డిగ్రీ అందుకున్నారు. ఆక్స్‌ఫర్డ్ యూనివర్సిటీలో డాక్టరేట్ పూర్తి చేశారు. పంజాబ్ యూనివర్సిటీలో ఎకనామిక్స్ లెక్చరర్‌గా ఉద్యోగంలో చేరిన డాక్టర్ సింగ్ అదే యూనివర్సిటీలో ప్రొఫెసర్ అయ్యారు. ఆ తర్వాత ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో ప్రొఫెసర్‌గా సేవలందించారు. జేఎన్‌యూలో హనరరీ ప్రొఫెసర్‌గా సేవలందించారు. 1991లో రాజ్యసభ సభ్యుడిగా ఎన్నికైన ఆయన ఐదు పర్యాయాలు పెద్దల సభకు ఎన్నికయ్యారు. రాజ్యసభ ఎంపీగా ఆయన పదవీకాలం 2024 ఏప్రిల్ లో ముగిసింది. ప్రత్యక్ష ఎన్నికల్లో ఢిల్లీ నుంచి లోక్‌సభ కు పోటీ చేసినా విజయం దక్కలేదు. ఆయన మృతికి పలువురు ప్రముఖులు సంతాపం ప్రకటించారు.