Telugu Global
National

బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం.. ఘాతుకానికి ఒడిగట్టింది ఆర్టీసీ సిబ్బందే

డెహ్రాడూన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అజయ్‌సింగ్‌ బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. తనది పంజాబ్‌ రాష్ట్రమని, తానొక అనాథనని తొలుత బాధితురాలు చెప్పిందని ఆయన వెల్లడించారు.

బస్సులో బాలికపై సామూహిక అత్యాచారం.. ఘాతుకానికి ఒడిగట్టింది ఆర్టీసీ సిబ్బందే
X

కోల్‌కతాలో ట్రైనీ వైద్యురాలిపై మెడికల్‌ కాలేజీలోనే దారుణ హత్యాచారం జరిగిన ఘటనపై దేశమంతా అట్టుడుకుతున్న వేళ.. మరో దారుణ కాండ తాజాగా వెలుగుచూసింది. బాలికపై బస్సులోనే సామూహిక అత్యాచారానికి పాల్పడిన దారుణం ఉత్తరాఖండ్‌లోని డెహ్రాడూన్‌లో జరిగింది. ఈనెల 12న ఈ ఘటన చోటుచేసుకోగా.. శనివారం పోలీసులకు ఫిర్యాదు అందింది. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీటీవీ దృశ్యాల ఆధారంగా దర్యాప్తు చేపట్టి.. ఐదుగురు నిందితులను అరెస్ట్‌ చేశారు.

పోలీసులు తెలిపిన వివరాల ప్ర‌కారం..

ఈనెల 12వ తేదీ అర్ధరాత్రి సమయంలో అంతర్రాష్ట్ర బస్‌ టెర్మినల్‌ 12వ నంబరు ప్లాట్‌ఫాంపై ఓ బాలిక ఒంటరిగా కూర్చుని ఉందంటూ జిల్లా శిశు సంక్షేమ కమిటీకి సమాచారం అందింది. అనంతరం కమిటీ సభ్యులు అక్కడికి చేరుకొని బాలికను బాలనికేతన్‌కు తరలించారు. అక్కడ కౌన్సెలింగ్‌ ఇవ్వగా బాలిక జరిగిన సంగతిని వివరించింది. దీంతో శిశు సంక్షేమ కమిటీ సభ్యురాలు ప్రతిభా జోషి శనివారం సాయంత్రం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో రంగంలోకి దిగిన పోలీసులు సీసీ టీవీ దృశ్యాలను విశ్లేషించి దారుణం జ‌రిగిన ఉత్తరాఖండ్‌ ప్రభుత్వ బస్సును స్వాధీనం చేసుకున్నారు.

డెహ్రాడూన్‌ సీనియర్‌ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్‌ అజయ్‌సింగ్‌ బాధితురాలితో మాట్లాడి వివరాలు సేకరించారు. తనది పంజాబ్‌ రాష్ట్రమని, తానొక అనాథనని తొలుత బాధితురాలు చెప్పిందని ఆయన వెల్లడించారు. అనంతరం తనది ఉత్తరప్రదేశ్‌లోని మొరాదాబాద్‌ అని చెప్పిందన్నారు. బాలిక మొరాదాబాద్‌ నుంచి ఢిల్లీకి, అక్కడి నుంచి డెహ్రాడూన్‌కు వచ్చినట్టు దర్యాప్తులో వెల్లడైందని చెప్పారు. బస్సు డెహ్రాడూన్‌కు చేరుకున్న తర్వాత ప్రయాణికులంతా దిగిపోయాక తొలుత డ్రైవర్, కండక్టర్‌ బాలికపై అఘాయిత్యానికి పాల్పడినట్టు తమ దర్యాప్తులో తేలిందని అజయ్‌సింగ్‌ వెల్లడించారు. అనంతరం పక్కనే నిలిపి ఉంచిన బస్సుల డ్రైవర్లు ఇద్దరు, ఆ తర్వాత బస్టాండ్‌లోని క్యాషియర్‌ కూడా దారుణానికి ఒడిగట్టారని వివరించారు. నిందితులు ఉత్తరాఖండ్, ఉత్తరప్రదేశ్‌ రాష్ట్రాలకు చెందినవారని ఆయన చెప్పారు. వారిలో ప్రభుత్వ బస్సు డ్రైవర్లు, కండక్టర్‌ కూడా ఉన్నారని వెల్లడించారు.

First Published:  19 Aug 2024 10:30 AM IST
Next Story