Telugu Global
National

ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమే

అంగీకరించిన కర్నాటక సీఎం సిద్దరామయ్య

ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమే
X

ఎన్నికలకు ముందు ప్రజలకిచ్చిన ఐదు గ్యారంటీలు ప్రభుత్వానికి భారమేనని కర్నాటక సీఎం సిద్దరామయ్య అంగీకరించారు. సోమవారం నేషనల్‌ మీడియాతో మాట్లాడిన సిద్దరామయ్య ఐదు గ్యారంటీ అమలు కోసం తమ ప్రభుత్వం ఇబ్బందులు ఎదుర్కొంటున్న మాట నిజమేనని ఒప్పుకున్నారు. ఖజానాకు అవి భారంగా మారినా వాటి అమలును ఆపేయబోమన్నారు. రాష్ట్ర బడ్జెట్‌లో అభివృద్ధి పనుల కోసం రూ.60 వేల కోట్లు కేటాయిస్తే, ఐదు గ్యారంటీల అమలుకే రూ.56 వేల కోట్లు కేటాయించాల్సి వచ్చిందని తెలిపారు. ఎంత కష్టమైనా అభివృద్ధి కార్యక్రమాలను కొనసాగిస్తూనే గ్యారంటీలను అమలు చేస్తామన్నారు. రాష్ట్ర బడ్జెట్‌ పరిమితికి మించి హామీలు ఇవ్వొద్దని ఇటీవల ఏఐసీసీ చీఫ్‌ మల్లికార్జున ఖర్గే చేసిన కామెంట్స్‌ పై స్పందిస్తూ ఖర్గే వ్యాఖ్యలను తప్పుగా అర్థం చేసుకున్నారని సిద్దరామయ్య అన్నారు. మహిళలకు ఉచిత బస్సు సదుపాయాన్ని సమీక్షిస్తామని ఇటీవల కర్నాటక డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌ అన్నారు. ఈక్రమంలోనే మల్లికార్జున ఖర్గే రాష్ట్ర బడ్జెట్‌ కు మించి హామీలివ్వొద్దని కాంగ్రెస్‌ రాష్ట్ర నాయకత్వాలకు సూచించారు. రాష్ట్రాల్లో కాంగ్రెస్‌ పార్టీ నేతలు ఇచ్చే హామీలు అమలు చేయకుంటే ప్రతిపక్షాలు రాహుల్‌ గాంధీని దోషిగా చూపించే ప్రయత్నం చేస్తున్నారని అది పార్టీకి మంచిది కాదని సూచించారు. ఈ నేపథ్యంలోనే మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ గ్యారంటీలను ప్రకటించలేదు.

First Published:  11 Nov 2024 9:29 PM IST
Next Story