ఫెంజల్ తుపాను ఎఫెక్ట్.. అదుపుతప్పిన ఇండిగో విమానం
తుపాను ప్రభావంతో తమిళనాడు, ఏపీలో భారీ వర్షాలు.. పలు విమాన సర్వీసులు రద్దు
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంజల్ తుపాను ప్రభావంతో తమిళనాడులో అతి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో చాలా ప్రాంతాల్లో వరద నీరు పోటెత్తింది. చెన్నై విమానాశ్రయంలో కూడా నీరు చేరింది. రన్‌వేలు నీటిలో ఉండటంతో విమానాలు దిగడానికి, ఎగరడానికి తీవ్ర ఇబ్బందులుపడ్డాయి. వర్షాల ఉధృతి పెరగడంతో ఉదయం కొన్నిగంటలు విమానాశ్రయాన్నే మూసేయాల్సిన పరిస్థితి వచ్చింది. కాగా చెన్నై విమానాశ్రయంలో ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానానికి త్రుటిలో ప్రమాదం తప్పింది. ఇండిగో ఎయిర్‌లైన్స్ ఎయిర్‌బస్ విమానం ల్యాండ్ అవడానికి ప్రయత్నించగా.. ప్రతికూల వాతావరణ పరిస్థితులతో నియంత్రణ కోల్పోయింది. దీంతో తిరిగి గాల్లోకి ఎగిరింది. ఈ ఘటనకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. తుపాను ప్రభావం తీవ్రంగా ఉండటంతో విశాఖ-చెన్నై సర్వీసులను కూడా రద్దు చేసినట్లు అధికారులు తెలిపారు. అలాగే ఫెంజల్ తుఫాను ప్రభావంతో ఏపీలోని పలు ప్రాంతాల్లోనూ భారీ వర్షాలు పడుతున్నాయి. ఈ కారణంగా విశాఖ నుంచి పలు విమాన సర్వీసులు రద్దయ్యాయి. తిరుపతిలో భారీ వర్షాల కారణంగా విశాఖ-తిరుపతి విమాన సర్వీసులను రద్దు చేశారు.
బంగాళాఖాతంలో ఏర్పడిన ఫెంజల్ తుపాను శనివారం సాయంత్రం తమిళనాడు తీరాన్ని తాకింది. తీరం వెంబడి గరిష్ఠంగా గంటకు 90 కి.మీ వేగంతో గాలులు వీస్తున్నాయి. చాలా జిల్లాల్లో రాకపోకలు స్తంభించాయి. చెన్నైలో అత్యంత భారీ వర్షాలు కురుస్తున్నాయి. గాలులు, కుండపోత వర్షాలతో సహాయక చర్యల్లో తీవ్ర జాప్యం జరుగుతున్నది. పుదుచ్చేరిలో పర్యాటక ప్రాంతాలనూ మూసేశారు.