మలయాళ సినీ పరిశ్రమలో తెర వెనుక సంచలనాలు.. జస్టిస్ హేమ నివేదికతో బట్టబయలు
295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేయడం గమనార్హం.
మలయాళ సినీ పరిశ్రమలో నటీమణులపై లైంగిక వేధింపుల గుట్టు తాజాగా బయటపడింది. జస్టిస్ హేమ నివేదికతో ఈ వ్యవహారం వెలుగు చూసింది. అక్కడి ఇండస్ట్రీలోని 15 మంది పెద్దలు ఇండస్ట్రీ మొత్తాన్ని గుప్పెట్లో పెట్టుకొని ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్న తీరు బట్టబయలైంది. 2017లో మలయాళ నటి భావనా మీనన్‌పై కొంతమంది దుండగులు కొచ్చి శివార్లలో లైంగిక దాడికి పాల్పడ్డ ఘటన తీవ్ర చర్చనీయాంశమైంది. ఆ కేసులో సూత్రధారిగా మలయాళ సూపర్ స్టార్ దిలీప్ పేరు రావడంతో అది సర్వత్రా విస్మయానికి గురిచేసింది. అప్పట్లో అన్ని విధాలుగా వచ్చిన ఒత్తిళ్ల నేపథ్యంలో కేరళ ప్రభుత్వం మలయాళ చిత్ర పరిశ్రమలో స్త్రీల పరిస్థితిని అధ్యయనం చేయడానికి జస్టిస్ హేమా కమిషన్‌ను నియమించింది. మన సీనియర్ నటీమణి శారద కూడా ఈ కమిటీలో ఒక సభ్యురాలు కావడం గమనార్హం.
విచారణ ముగించిన కమిషన్ 2019లో ప్రభుత్వానికి నివేదిక అందించినా అనేక కారణాల వల్ల అది బయటకు రాలేదు. తాజాగా కేరళ హైకోర్టు ఆదేశాలతో ’రైట్ టు ఇన్ఫర్మేషన్’ యాక్ట్ కింద ఆ కమిటీ రిపోర్టు బయటికొచ్చింది. దీంతో ఈ నివేదికను తాజాగా మీడియాకు అందజేశారు. 295 పేజీలతో కమిటీ నివేదికను రూపొందిస్తే.. చాలా సున్నితమైన అంశాలు, వ్యక్తిగత వివరాలు ఉన్న కారణంగా 63 పేజీలను మినహాయించి మిగతా నివేదికను బహిర్గతం చేయడం గమనార్హం.
’ఆయన నన్ను చాలా సందర్భాల్లో లైంగికంగా వేధించే ప్రయత్నం చేశాడు. నేను లొంగలేదు. అందుకే ఓ సినిమాలో కౌగిలించుకునే పాత్రను సృష్టించి 17 సార్లు రీషూట్ చేశారు. ఆ విధంగా అతను నన్ను మరింత వేధించడం మొదలు పెట్టాడు’ జస్టిస్ హేమా కమిటీ ముందు కన్నీళ్లు పెట్టుకుంటూ ఓ సీనియర్ నటి వ్యక్తం చేసిన ఆవేదన ఇది. అడపాదడపా కాకుండా ఈ తరహా వేధింపు ఘటనలు పరిశ్రమలో సర్వసాధారణంగా జరుగుతున్నాయని కమిటీ ఆధారాలతో సహా బయటపెట్టింది. ఇండస్ట్రీలోకి రావాలంటే సర్దుకుపోండి... రాజీపడండి.. మలయాళ సినీ పరిశ్రమలో అవకాశాల కోసం వచ్చే మహిళలకు పరిశ్రమ పెద్దలు చెప్పే రెండు మాటలు ఇవే. వీటికి సిద్ధపడి జీవితాలను అర్పించుకుంటేనే భారీ పారితోషకాలతో మెండుగా అవకాశాలు కల్పిస్తారు. కాదు... కూడదని ఎదురు తిరిగితే మాత్రం వాళ్ల జీవితాలను నాశనం చేయడానికి కూడా వెనుకాడరు. పోలీసులకు ఫిర్యాదు చేయడానికి కూడా బాధితులు ముందుకు రారంటే వేధింపులు ఏ స్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. జస్టిస్ హేమ నివేదికపై పినరయి విజయన్ ప్రభుత్వం ఎలాంటి చర్యలు తీసుకుంటుందనేది ఇప్పుడు మాలీవుడ్‌తో పాటు భారతీయ సినీ పరిశ్రమ అంతటా ఆసక్తి నెలకొంది.