Telugu Global
National

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఈసారి 8.25 శాతమే

సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ సమావేశంలో నిర్ణయం

ఈపీఎఫ్‌ వడ్డీ రేటు ఈసారి 8.25 శాతమే
X

ఉద్యోగుల భవిష్య నిధి (ఈపీఎఫ్‌) ఖాతాల్లో నిల్వలపై వడ్డీ రేటు ఖరారైంది. 2024-25 ఆర్థిక సంవత్సరానికి గానూ 8.25 శాతం వడ్డీ రేటునే కొనసాగించాలని నిర్ణయించారు. ఈ మేరకు శుక్రవారం జరిగిన సెంట్రల్‌ బోర్ట్‌ ఆఫ్‌ ట్రస్టీస్‌ (సీబీటీ_ సమావేశంలో నిర్ణయం తీసుకున్నట్లు ఈపీఎఫ్‌ వర్గాలు వెల్లడించాయి. 2023-24 ఆర్థిక సంవత్సరానికి కూడా ఇదే వడ్డీని చెల్లించిన విషయం విదితమే. పాత వడ్డీ రేటును కొనసాగించడంపై అనేక కారణాలు ఉన్నట్లు సమాచారం. స్టాక్‌ మార్కెట్‌, బాండ్ల దిగుబడి నుంచి ఈపీఎఫ్‌వో ఆదాయం తగ్గడంతో పాటు క్లెయిమ్‌లను ఎక్కువగా పరిష్కరించడం దీనికి కారణంగా అభిప్రాయపడుతున్నారు. 2022-23 ఆర్థిక సంవత్సరంలో ఈపీఎఫ్ చందాదారులకు 8.15 శాతం వడ్డీని అందించిన ఈపీఎఫ్‌వో . 2023-24 ఆర్థిక సంవత్సంలో 8.25 శాతానికి పెంచిన సంగతి తెలిసిందే.

సీబీటీ నిర్ణయాన్ని కేంద్ర ఆర్థిక శాఖకు పంపనున్నారు. ప్రభుత్వం నుంచి ఆమోదం వచ్చిన తర్వాత వడ్డీ రేటును ఈపీఎఫ్ వో అధికారికంగా నోటిఫై చేస్తుంది. ఆ తర్వాత వడ్డీ మొత్తాన్నిఈపీఎఫ్ వో 7 కోట్ల చందాదారుల ఖాతాలో జమ చేస్తుంది. సీబీటీ ప్రతిపాదనలపై కేంద్ర ఆర్థికశాఖ త్వరలోనే నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం.

అంతకుముందు 2022 మార్చిలో 202122 సంవత్సరానికి గాను ఈపీఎఫ్ వడ్డీ రేటును 8.1 శాతానికి తగ్గించారు. వడ్డీ రేటు ఇంత తక్కువగా ఉండటం 1977-78తర్వాత మళ్లీ అప్పుడే కావడం విశేషం. ఆ తర్వాత రెండేళ్ల పాటు స్వల్పంగా పెంచుతూ వచ్చిన ఈపీఎఫ్ వో .. తాజాగా స్థిరంగా ఉంచడం గమనార్హం.

First Published:  28 Feb 2025 12:17 PM IST
Next Story