రెండు రాష్ట్రాల ఎన్నికలు.. భారీగా నగదు, మద్యం, డ్రగ్స్ స్వాధీనం
మహారాష్ట్ర, జార్ఖండ్ ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు భారీ యత్నాలు
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల ప్రచారం ముగిసింది. ఎన్నికల్లో ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు రాజకీయ పార్టీలు, అభ్యర్థులు అక్రమంగా తరలిస్తున్న రూ.1,082 కోట్ల విలువైన తాయిళాలు సీజ్ చేశామని కేంద్ర ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో వెల్లడించింది. ఎన్నికల వేళ ఓటర్లను ప్రలోభ పెట్టకుండా అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున చెక్ పోస్టులు ఏర్పాటు చేశారు. ఇలా చేపట్టిన తనిఖీల్లో రూ.181.97 కోట్ల నగదు, రూ.119.83 కోట్ల విలువైన మద్యం, రూ.123.57 కోట్ల విలువైన డ్రగ్స్, రూ.302.08 కోట్ల విలువైన నగలు, రూ.354.76 కోట్ల విలువైన వస్తువులు సీజ్ చేశామని తెలిపారు. మొత్తం సీజ్ చేసిన తాళాలాల్లో మహారాష్ట్రలోనే రూ.660.18 కోట్ల విలువైనవి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. జార్ఖండ్ లో రూ.198.12 కోట్లు, 14 రాష్ట్రాల్లోని ఒక లోక్‌సభ, అసెంబ్లీ ఉప ఎన్నికలు జరుగుతున్న ప్రాంతాల్లో రూ.223.91 కోట్ల విలువైన తాయిళాలు ఉన్నాయని వెల్లడించారు. 2019లో జరిగిన ఎన్నికలతో పోల్చితే ఇప్పుడు స్వాధీనం చేసుకున్న తాయిళాల విలువ ఏడు రెట్లు ఎక్కువ అని తెలిపారు.