మహారాష్ట్ర సీఎం పదవికి శిండే రాజీనామా
మహారాష్ట్ర 14వ అసెంబ్లీ పదవీ కాలం నేటితో ముగియడంతో చోటు చేసుకున్నఈ పరిణామం
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి ఘన విజయం సాధించిన విషయం విదితమే. ఈ క్రమంలోనే కీలక పరిణామం చోటు చేసుకున్నది. ఆ రాష్ట్ర సీఎం ఏక్‌నాథ్ శిండే తన పదవికి రాజీనామా చేశారు. ఈ మేరకు మంగళవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌కు తన రాజీనామా పత్రాన్ని సమర్పించారు. రాజీనామా సమర్పించే సమయంలో ఆయన వెంట దేవంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ ఉన్నారు.మహారాష్ట్ర 14వ అసెంబ్లీ పదవీ కాలం నేటితో ముగియడంతో ఈ పరిణామం చోటు చేసుకున్నది. మరోవైపు తదుపరి సీఎంపై స్పష్టత వచ్చేవరకు ఆపధర్మ సీఎంగా శిండే వ్యవహరించనున్నారు.
మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు మహాయుతి కూటమి234 సీట్లతో ఘన విజయం సాధించింది. విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) 48 సీట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానంతో పాటు రాష్ట్ర నాయకత్వం బలంగా కోరుకుంటున్నది. బీహార్ ఫార్ములా తరహాలో శిండేనే కొనసాగించాలని శివసేన కోరుతున్నది. అయితే ఇవాళ ఉదయం ఏక్‌నాథ్ శిండే ఎక్స్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. దేవేంద్ర ఫడ్నవీస్‌కు మార్గం సుగమం చేయడానికి ఆయన సీఎం రేసు నుంచి తప్పుకుంటున్నారని అక్కడి రాజకీయవర్గాల్లో చర్చ జరుగుతున్నది. తాజాగా శిండే తన పదవికి రాజీనామా చేయడంతో తదుపరి సీఎం బాధ్యతలు ఎవరు స్వీకరిస్తారనే దానిపై ఉత్కంఠ కొనసాగుతున్నది.