Telugu Global
National

బీజేపీకి ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకొచ్చిందా?

ఓటు బ్యాంకు కోసం ఆర్టికల్‌ 370 అంశాన్ని ఇంకా సజీవంగా ఉంచుతున్నదని ఖర్గే ఫైర్‌

బీజేపీకి ఇప్పుడు రాజ్యాంగం గుర్తుకొచ్చిందా?
X

జమ్ముకశ్మీర్‌లో ఆర్టికల్‌ 370ని పునరుద్ధరించాలని చూస్తున్నదన్న ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా వ్యాఖ్యలను కాంగ్రెస్‌ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే ఖండించారు. ఆ వివాదాస్పద నిబంధనను పార్లమెంటు రద్దు చేసిందని ఖర్గే గుర్తు చేశారు. సమాజంలో చీలికలు సృష్టించడానికి, ఓటు బ్యాంకు కోసం ఆర్టికల్‌ 370 అంశాన్ని ఇంకా సజీవంగా ఉంచుతున్నదని ఆరోపించారు. పూణెలో మీడియాతో మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. ఆర్టికల్‌ 370 పునరుద్ధరిస్తామని ఏ కాంగ్రెస్‌ నాయకుడు చెప్పాడని నిలదీశారు. దేశ ఐక్యత కోసం ఇందిరాగాంధీ, రాజీవ్‌గాంధీ ప్రాణత్యాగం చేశారని, కానీ బీజేపీ దేశ ఐక్యత, స్వాతంత్య్రం, పేదల కోసం ఏనాడూ పోరాడలేదన్నారు. ఎస్సీ, ఎస్టీ కోటా రిజర్వేషన్లు కల్పించిన ఘనత కాంగ్రెస్‌ పార్టీకి చెందుతున్నారు. ఆ రిజర్వేషన్లను కాంగ్రెస్‌ ఎత్తివేస్తుందని ప్రధాని చెబుతున్నారని ఖర్గే మండిపడ్డారు. మనుస్మృతి ఆధారంగా రాజ్యాంగం ఉండాలని కోరుకున్న కాషాయ పార్టీకి ఇప్పుడు భారత రాజ్యాంగం గుర్తుకు వచ్చిందా? అని ప్రశ్నించారు. స్వాతంత్య్ర సమయంలో పార్టీ కార్యాలయంలోనూ భారత జాతీయ జెండా ఉండనివ్వలేదని ఖర్గే ఆరోపించారు.

First Published:  15 Nov 2024 9:43 AM IST
Next Story