తిరుమల శ్రీవాణి ట్రస్ట్ రద్దు
టీటీడీ బోర్డు మీటింగ్ లో నిర్ణయం
శ్రీవాణి ట్రస్ట్‌ను రద్దు చేస్తూ తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి నిర్ణయం తీసుకుంది. సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అధ్యక్షతన నిర్వహించిన ట్రస్ట్ బోర్డు సమావేశంలో ఈమేరకు నిర్ణయం తీసుకున్నారు. సమావేశం అనంతరం చైర్మన్ మీడియాకు సమావేశం వివరాలు వెల్లడించారు. శ్రీవాణి ట్రస్ట్ కు రూ.10 వేల విరాళం ఇచ్చి స్వామివారిని బ్రేక్ దర్శనం ద్వారా దర్శించుకునే విధానాన్ని రద్దు చేసినట్టు చేసినట్టు తెలిపారు. శ్రీవారి దర్శనానికి వచ్చే సాధారణ భక్తులకు సర్వదర్శనం ద్వారా రెండు, మూడు గంటల్లోనే దర్శనం కల్పించేలా చర్యలు తీసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు. శ్రీవాస సేతు ఫ్లై ఓవర్ పేరును గరుడ వారథిగా మార్చారు. తిరుమల దర్శనానికి వచ్చే వాళ్లు కొండపై రాజకీయాలు మాట్లాడకుండా చర్యలు తీసుకుంటామని తెలిపారు. ప్రైవేట్ బ్యాంకుల్లో నగదును ప్రభుత్వ బ్యాంకుల్లోకి బదలాయిస్తామన్నారు. శారదాపీఠం లీజును రద్దు చేసి ఆ సంస్థకు ఇచ్చిన స్థలాన్ని స్వాధీనం చేసుకుంటామని తెలిపారు. టూరిజం డిపార్ట్‌మెంట్ ద్వారా దర్శనం టికెట్ల విక్రయాన్ని రద్దు చేస్తున్నామని, ముంతాజ్ హోటల్ నిర్మాణానికి ఇచ్చిన అనుమతులు రద్దు చేస్తున్నామని చెప్పారు. తిరుపతి ప్రజలకు ప్రతినెల మొదటి మంగళవారం దర్శనం కల్పిస్తామన్నారు.