Telugu Global
National

మహాశివరాత్రి వేళ ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తిన భక్తులు

తెల్లవారుజాము నుంచే పుణ్యస్నానాలు ఆచరిస్తున్న భక్తులు.. నేటితో ముగియనున్న మహాకుంభమేళా

మహాశివరాత్రి వేళ ప్రయాగ్‌రాజ్‌కు పోటెత్తిన భక్తులు
X

ఉత్తరప్రదేశ్‌ ప్రయాగ్‌రాజ్‌లో మహాకుంభమేళా తుదిదశకు చేరుకున్నది. జనవరి 13న మొదలైన కుంభమేళా మహాశివరాత్రి అయిన నేడు ముగియనున్నది. మౌని అమావాస్య మాదిరిగానే త్రివేణి సంగమంలో పుణ్యస్నానాలు ఆచరించడానికి కోట్లాదిమంది భక్తులు ప్రయాగ్‌రాజ్‌కు తరలివెళ్తున్నారు. ఇప్పటికే త్రివేణి సంగమానికి చేరుకున్న భక్తులు పెద్ద సంఖ్యలో పుణ్యస్నానాలు ఆచరిస్తున్నారు. మంగళవారం రాత్రి సుమారు కోటి మంది భక్తులు త్రివేణి సంగమానికి చేరుకున్నట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని యూపీ ప్రభుత్వం కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసింది. మహాకుంభ నగర్‌ ప్రాంతాన్ని నో వెహికిల్‌ జోన్‌గా ప్రకటించింది. మంగళవారం సాయంత్రం 4 గంటల నుంచి కుంభమేళా ప్రాంతానికి ఒక్క వాహనాన్ని కూడా అనుమతించడం లేదు. భక్తులకు సమీపంలో ఉన్న ఘాట్‌లలో పుణ్యస్నానాలు పూర్తి చేయాలని, ఒకేచోటికి ఎక్కువ సంఖ్యలో తరలి రావొద్దని అధికారులు విజ్ఞప్తి చేస్తున్నారు. భక్తులు వచ్చే మార్గంలో వారికి సమీపంలో ఉండే ఘాట్‌లను సూచిస్తున్నారు. పుణ్యస్నానాలు పూర్తయిన వెంటనే భక్తులు ఘాట్‌లను ఖాళీ చేయాలని కోరుతున్న అధికారులు రద్దీ నివారించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

శివరాత్రి రద్దీ దృష్ట్యా సీఎం యోగి ఆదిత్యనాథ్‌ నిరంతరం అధికారులతో సమీక్ష నిర్వహిస్తున్నారు. భక్తుల భద్రతకు మొదటి ప్రాధాన్యం ఇవ్వాలని అధికారులకు విస్పష్ట ఆదేశాలు జారీ చేశారు. త్రివేణి సంగమం వద్ద 37 వేల మంది పోలీసులు, 14 వేల మంది హోం గార్డులను మోహించారు. పెద్ద ఎత్తున ఏఐ ఆధారిత కెమెరాలు, పోలీస్‌ కంట్రోల్‌ రూమ్‌ల ద్వారా భక్తుల అధికారులు నిరంతరం పర్యవేక్షిస్తున్నారు.

త్రివేణి సంగమంలో పుణ్యస్నానాల అనంతరం భక్తులు తిరుగు ప్రయాణం కానుండగా ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా యూపీ ఆర్టీసీ తో పాటు రైల్వేశాఖ ప్రత్యేక ఏర్పాట్లు చేశాయి. ప్రయాగ్‌రాజ్‌ నుంచి యూపీలోని ఇతర ప్రాంతాలకు తరలించడానికి యూపీఎస్‌ఆర్టీసీ 4,500 బస్సులను మోహరించింది. మహాకుంభనగర్‌ నుంచి సమీపంలోని బస్టాండ్‌కు తరలించడానికి ఉచితంగా 750 షటిల్‌ బస్సులను ఏర్పాటు చేశారు. రైల్వే శాఖ కూడా భక్తులను సురక్షితంగా వారి గమ్యస్థానాలకు చేరేందుకు 350 రైళ్లు నడుపుతున్నది. మౌని అమవాస్య రోజు 360 రైళ్లు నడిపినట్లు పేర్కొన్న రైల్వే శాఖ ఆరోజు 20 లక్షల మంది యాత్రికులను స్వస్థలాలకు సురక్షితంగా చేరవేసినట్లు తెలిపింది. ఇవాళ కూడా ప్రత్యేక ఏర్పాట్లు చేశామని, అవసరమైతే ప్రత్యేక భోగీలను ప్రయాగ్‌రాజ్‌ సమీపంలో సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నది.

First Published:  26 Feb 2025 12:40 PM IST
Next Story