మహారాష్ట్ర సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ ఖరారు!
బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా.. ఏకగ్రీవంగా ఆమోదించినట్లు సమాచారం
మహారాష్ట్రలో ప్రభుత్వం ఏర్పాటుపై సందిగ్ధం వీడినట్లే కనిపిస్తున్నది. తదుపరి సీఎంగా బీజేపీ సీనియర్ నేత దేవేంద్ర ఫడ్నవీస్ ఖరారైనట్లు సమాచారం. ఈ మేరకు బుధవారం జరిగిన బీజేపీ కోర్ కమిటీ సమావేశంలో ఫడ్నవీస్ పేరును ప్రతిపాదించగా.. ఏకగ్రీవంగా ఆమోదించినట్లు విశ్వసనీయవర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ 5న ఆయన సీఎంగా ప్రమాణస్వీకారం చేయనున్నట్లు తెలిపాయి. కోర్ కమిటీ భేటీ తర్వాత ముంబయిలోని విధాన్ భవన్‌లో బీజేపీ శాసనసభా పక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కేంద్ర పరిశీలకులుగా నిర్మలా సీతారామన్, విజయ్ రూపానీ హాజరయ్యారు. సీఎం ఎంపికపై పార్టీ ఎమ్మెల్యేలతో వారు చర్చించారు. అనంతరం బీజేపీఎల్పీ నేతగా దేవంద్ర ఫడ్నవీస్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.మహారాష్ట్ర గవర్నర్ సీపీ రాధాకృష్ణన్‌ను మధ్యాహ్నం మూడు గంటలకు మహాయుతి నేతలు కలవనున్నారు. ప్రభుత్వ ఏర్పాటుకు ఆహ్వానించాల్సిందిగా కోరనున్నారు.
గురువారం ఆజాద్ మైదానంలో ప్రమాణస్వీకారం జరగనున్నది. ప్రధాని మోడీ సహా ఎన్డీఏ కీలక నేతలు హాజరుకానున్నారు. సీఎంగా ఫడ్నవీస్‌తో పాటు శివసేన నేత ఏక్‌నాథ్ శిండే, ఎన్సీపీ నేత అజిత్ పవార్ డిప్యూటీ సీఎంలుగా ప్రమాణస్వీకారం చేస్తారని ప్రచారం జరుగుతున్నది. అయితే దీనిపై ఇంకా అధికారిక ప్రకటన వెలువడలేదు.
ప్రమాణ స్వీకారానికి అనుగుణంగా బీజేపీ, శివసేన, ఎన్సీపీల మధ్య కేబినెట్ కేటాయింపులు ఉండబోతున్నట్లు సమాచారం. మహారాష్ట్రలో బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించింది. 132 సీట్లు గెలుచుకుని ప్రభుత్వ ఏర్పాటునకు అవసరమైన మెజారిటీ మార్క్ కు 13 సీట్ల దూరంలోనే ఉన్నది. అయితే సీఎం ఎంపిక విషయంలో ఆలస్యం కావడానికి కారణం ఏక్‌నాథ్ శిండేనే. ఆయన బీజేపీ ప్రభుత్వ ఏర్పాటునకు మద్దతు ఇస్తానని చెప్పినా సీఎంగా తననే కొనసాగించాలని పట్టుబట్టారు. దీనిపై మహాయుతి కూటమిలోని శివసేన, బీజేపీ నేతల మధ్య భిన్నవాదనలు వ్యక్తమయ్యాయి. అయితే బీజేపీ అధిష్ఠానం ప్రభుత్వ ఏర్పాటు విషయంలో శిండేను ఒప్పించిన తర్వాతే ముందుకెళ్లాలని భావించింది. ఆయన అంగీకారం తర్వాతే ప్రభుత్వ ఏర్పాటు, సీఎం పై ప్రకటన చేయాలని నిర్ణయించింది. ఈ నేపథ్యంలోనే రెండేళ్లు మహారాష్ట్ర సీఎంగా పనిచేసిన శిండే చివరికి దేవేంద్ర ఫడ్నవీస్ నాయకత్వంలో పనిచేయడానికి సుమఖత వ్యక్తం చేయడంతో మహాయుతి ప్రభుత్వ ఏర్పాటునకు మార్గం సుగమం అయ్యింది.