తదుపరి సీఎం దేవంద్ర ఫడ్నవీస్ కావొచ్చు
శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయం సాధించడం, ఏక్‌నాథ్ శిండే సీఎం పదవికి రాజీనామా చేయడంతో ఆ రాష్ట్రానికి తదుపరి సీఎం ఎవరనే చర్చ జరుగుతున్నది. ఈ నేపథ్యంలో శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఏక్‌నాథ్ శిండే తన పదవికి రాజీనామా చేశారని.. తదుపరి సీఎం దేవంద్ర ఫడ్నవీస్ కావొచ్చనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. తమ పార్టీల కోసం ఏక్‌నాథ్ శిండే, అజిత్ పవార్‌లు సొంతంగా నిర్ణయాలు తీసుకోలేరన్నారు. ఈ రెండు పార్టీలు ప్రధాని మోడీ, కేంద్ర హోం మంత్రి కనుసన్నల్లోనే నడుస్తున్నాయని.. ప్రస్తుతం బీజేపీ మెజారిటీ సాధించింది కాబట్టి వారికి అవకావం ఉండకపోవచ్చన్నారు.
మహారాష్ట్రలోని మొత్తం 288 స్థానాలకు మహాయుతి కూటమి234 సీట్లతో ఘన విజయం సాధించింది. విపక్ష మహా వికాస్ అఘాడీ (ఎంవీఏ) 48 సీట్లకే పరిమితమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో బీజేపీ నుంచే సీఎం అభ్యర్థి ఉండాలని ఆ పార్టీ అధిష్ఠానంతో పాటు రాష్ట్ర నాయకత్వం బలంగా కోరుకుంటున్నది. అయితే ఇవాళ ఉదయం ఏక్‌నాథ్ శిండే ఎక్స్‌లో పెట్టిన పోస్టు వైరల్‌గా మారింది. 2019లోనూ బీజేపీ అతిపెద్ద పార్టీగా అవతరించినా సీఎం విషయంలో విభేదాలు తలెత్తతడంతో బీజేపీ-శివసేన కూటమి విడిపోయింది. అజిత్ పవార్‌తో కలిసి దేవేంద్ర ఫడ్నవీస్ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినా మూడు రోజులకే ఆ ప్రభుత్వం పడిపోయింది. ఉద్దవ్ కాంగ్రెస్, ఎన్సీపీలతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశారు. రెండేళ్ల తర్వాత జరిగిన పరిణామాలతో మహావికాస్ అఘాడీ ప్రభుత్వం కూలిపోయి మహాయుతి ప్రభుత్వం కొలువుదీరింది. ఇప్పుడు కూడా బీజేపీనే 132 స్థానాలు గెలచుకుని అతి పెద్ద పార్టీగా అవతరించినా మెజారిటీకి (145 సీట్లు) 13 సీట్ల దూరంలో ఉన్నది. శిండే నేతృత్వంలో శివసేన 57 సీట్లు గెలుచుకున్నది. అందుకే బీహార్ ఫార్ములా తరహాలో శిండేనే కొనసాగించాలని శివసేన కోరుతున్నది. అయితే 41 స్థానాలు గెలుచుకున్న అజిత్ పవార్ పార్టీ ఎన్సీపీ రూపంలో బీజేపీ పెద్ద మద్దతుదారు ఉన్నారు. ఈ నేపథ్యంలో సీఎం సీటు విషయంలో శిండేకు రాజీపడటం తప్పా మరో మార్గం లేదంటున్నారు.