దర్శన్, పవిత్ర గౌడకు హైకోర్టులో ఊరట
రేణుకాస్వామి హత్య కేసులో దర్శన్‌తో పాటు పవిత్ర గౌడకు బెయిల్ మంజూరు చేసిన కర్ణాటక హైకోర్టు
తన అభిమాని, చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేసులో అరెస్టయిన కన్నడ నటుడు దర్శన్ కు ఊరట దక్కింది. ఈ హత్య కేసులో కర్ణాటక హైకోర్టు దర్శన్‌తో పాటు అతని స్నేహితురాలు పవిత్ర గౌడకు బెయిల్ మంజూరు చేసింది. అలాగే ఈ కేసులో ప్రస్తుతం జైలు శిక్ష అనుభవిస్తున్న మరో ఏడుగురికి బెయిల్ ఇచ్చింది.
చిత్రదుర్గకు చెందిన రేణుకాస్వామి హత్య కేులో జూన్ 11న దర్శన్ అరెస్టు సంచలనంగా మారిన విషయం విదితమే. తన స్నేహితురాలు పవిత్రా గౌడకు అసభ్యకర మెసేజ్ పంపాడని అతడిని చిత్రహింసలకు గురిచేసి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ వ్యవహారంలో దర్శన్, ఆయన స్నేహితురాలు పవిత్ర గౌడ సహా 15 మందిని అరెస్టు చేశారు. రేణుకాస్వామిని నిందితులు అత్యంత పాశవికంగా కొట్టినట్లు తేలింది. అతనికి కరెంట్ షాక్ కూడా పెట్టినట్లు పోస్టుమార్టం నివేదిక పేర్కొన్నది. ఈ కేసులో ఇప్పటికే తాత్కాలిక బెయిల్ పై ఉన్న దర్శన్ తనకు రెగ్యులర్ బెయిల్ మంజూరు చేయాలంటూ మరో పిటిషన్ వేయగా.. ఉపశమనం కలిగింది. దర్శన్ ప్రస్తుతం వెన్నునొప్పితో ఆస్పత్రిలో చేరి చికిత్స పొందుతున్నారు.