Telugu Global
National

బీజాపూర్‌లో కొనసాగుతున్న ఎదురు కాల్పులు

నారాయాణపూర్‌ జిల్లాలో ఐఈడీ పేల్చిన మావోయిస్టులు

బీజాపూర్‌లో కొనసాగుతున్న ఎదురు కాల్పులు
X

ఛత్తీస్‌గఢ్‌లోని నారాయాణపూర్‌ జిల్లాలో మావోయిస్టులు ఐఈడీ పేల్చారు. ఈ ఘటనలో ఇద్దరు జవాన్లకు గాయాలయ్యాయి. ఛత్తీస్‌గఢ్‌ సరిహద్దులోని బీజాపూర్‌ జిల్లాలో గురువారం మావోయిస్టులు, భద్రతా బలగాలకు మధ్య భీకర ఎదురు కాల్పులు జరిగిన విషయం విదితమే. ఈ ఘటనలో 17 మంది మావోయిస్టులు మృతి చెందారు. మరోవైపు శుక్రవారం కూడా ఇక్కడ ఎదురు కాల్పులు కొనసాగుతున్నాయి.

దక్షిణ బస్తర్‌ అడవుల్లో పెద్ద ఎత్తున మావోయిస్టులు ఉన్నారనే నిఘా వర్గాల సమాచారంతో బీజాపూర్‌, సుక్మా, దంతెవాడ జిల్లాల నుంచి డీఆర్‌జీ (డిస్ట్రిక్ట్‌ రిజర్వ్‌ గార్డ్‌), కోబ్రా 204, 205, 206, 208, 210, సీఆర్పీఎఫ్‌ 229 బెటాలియన్లకు చెందిన సుమారు 1,500 మంది వరకు జవాన్లు గురువారం దండకారణ్యంలో కూంబింగ్‌ చేపట్టారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య ఉదయం నుంచి సాయంత్రం వరకు భారీ ఎదురుకాల్పులు జరగ్గా 17 మంది మావోయిస్టులు మృతి చెందినట్లు తెలుస్తోంది. ఘటనా ప్రాంతం నుంచి ఒక ఎస్‌ఎల్‌ఆర్‌తో పాటు పెద్ద ఎత్తున ఆయుధ సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఈ విషయాన్ని పోలీసులు అధికారికంగా ధృవీకరించలేదు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎదురుకాల్పులు జరగుతున్నట్లు బస్తర్‌ ఐజీ సుందర్‌రాజ్‌ వెల్లడించారు. పూర్తి వివరాలను ఆపరేషన్‌ తర్వాత వెల్లడిస్తామన్నారు.

First Published:  17 Jan 2025 12:55 PM IST
Next Story