రేవంత్ ఏడాది పాలనపై హైకమాండ్ పోస్టుమార్టం
పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశానికి కేసీ వేణుగోపాల్
తెలంగాణలో రేవంత్ రెడ్డి ఏడాది పాలనపై కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పోస్టుమార్టం నిర్వహిస్తోంది. గాంధీ భవన్ లో పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జీ దీపాదాస్ మున్షి అధ్యక్షతన బుధవారం నిర్వహించిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో పార్టీ ముఖ్యనేత, ఏఐసీసీ జనరల్ సెక్రటరీ కేసీ వేణుగోపాల్ పాల్గొన్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు కమిటీలో సభ్యులుగా ఉన్న 23 మంది ముఖ్య నాయకులు పాల్గొన్నారు. ఏడాది పాలనలో రేవంత్ రెడ్డి తీసుకున్న నిర్ణయాలు, హైడ్రా కూల్చివేతలు పర్యవసానాలు, లా అండ్ ఆర్డర్ ఫెయిల్యూర్, గురుకులాల్లో ఘటనలు, లగచర్ల భూసేకరణ తదతనంత పరిణామాలు, మూసీ ప్రాజెక్టు, రైతు రుణమాఫీ, ఆరు గ్యారంటీల అమలు సహా పలు కీలక నిర్ణయాలపై సమావేశంలో సమీక్షించనున్నారు. ముఖ్యమంత్రి, మంత్రులు, ఎమ్మెల్యేల పనితీరు, కాంగ్రెస్ పార్టీ నిర్వహించిన థర్డ్ పార్టీ సర్వేలో వెల్లడైన అంశాలపైనా సమావేశంలో చర్చించనున్నారు. ఈ సమావేశంలో చర్చించిన అంశాలపై కేసీ వేణుగోపాల్ కాంగ్రెస్ ముఖ్యనేత సోనియాగాంధీ, ఏఐసీసీ చీఫ్ మల్లికార్జున్ ఖర్గే, లోక్‌సభలో ప్రతిపక్షనేత రాహుల్ గాంధీకి నివేదిక సమర్పించనున్నారు.