Telugu Global
National

ఓబీసీలను విభజిస్తేనే కాంగ్రెస్‌ బతుకు

మహారాష్ట్ర ఎన్నికల ప్రచార సభలో ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు

ఓబీసీలను విభజిస్తేనే కాంగ్రెస్‌ బతుకు
X

ఓబీసీలను విభజిస్తేనే కాంగ్రెస్‌ బతుకు అని ప్రధాని నరేంద్రమోదీ తీవ్ర ఆరోపణలు చేశారు. మంగళవారం మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో భాగంగా షోలాపూర్‌ లో నిర్వహించిన ఎన్నికల ప్రచార సభలో కాంగ్రెస్‌ పై ప్రధాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ఓబీసీల్లో విభజన తెచ్చేందుకే కాంగ్రెస్‌ పార్టీ కుల గణన పేరుతో కుట్రలు చేస్తోందన్నారు. ఓబీసీలు ఐక్యంగా ఉంటేనే వారికి రక్షణ ఉంటుందని, విభజనకు తావిచ్చారో చాలా ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. కాంగ్రెస్‌ విభజన రాజకీయాలను ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్‌ కుట్రలను అడ్డుకొని తీరుతామన్నారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి అభ్యర్థులను గెలిపించాలని విజ్ఞప్తి చేశారు.

మహారాష్ట్రలో ఎల్లుండి మోదీ చివరి ప్రచార ర్యాలీ..

మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారాన్ని ప్రధాని నరేంద్రమోదీ గురువారం ముగించనున్నారు. ఈనెల 14న ముంబైలోని శివాజీ మైదాన్‌ లో నిర్వహించే ఎన్నికల ప్రచార ర్యాలీలో ఆయన పాల్గొని ప్రసంగిస్తారు. ఈనెల 16న ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్నారు. మహారాష్ట్ర అసెంబ్లీతో పాటు జార్ఖండ్‌ అసెంబ్లీ రెండో విడత ఎన్నికలు ఈనెల 20న జరగనున్నారు. బుధవారం జార్ఖండ్‌ తొలి విడత పోలింగ్‌ జరగనుంది. సోమవారమే జార్ఖండ్‌ అసెంబ్లీ, వయనాడ్‌ లోక్‌సభ ఎన్నికల ప్రచారం ముగిసింది. జార్ఖండ్‌ రెండో విడత, మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల ప్రచారానికి ఈనెల 18వ తేదీ సాయంత్రం వరకు గడువు ఉంది. విదేశీ పర్యటన నేపథ్యంలో నాలుగు రోజుల ముందుగానే మోదీ ఎన్నికల ప్రచార సభలు ముగించనున్నారు.

16న నైజీరియాకు ప్రధాని మోదీ

ప్రధాని నరేంద్రమోదీ ఈనెల 16న నైజీరియా పర్యటకు బయల్దేరుతున్నారు. 16, 17 తేదీల్లో ఆయన నైజీరియాలో పర్యటిస్తారు. 17 ఏళ్ల తర్వాత నైజీరియా పర్యటనకు వెళ్తున్న ప్రధాని మోదీనే. బ్రెజిల్‌ లో ఈనెల 18, 19 తేదీల్లో నిర్వహించనున్న జీ 20 సదస్సులో మోదీ పాల్గొంటారు. అనంతరం గయానా పర్యటనకు వెళ్తారు. 19 నుంచి 21వ తేదీ వరకు ప్రధాని గయానాలో పర్యటిస్తారు. 56 ఏళ్ల తర్వాత గయానాలో పర్యటిస్తున్న ప్రధానిగా నరేంద్రమోదీ రికార్డు నెలకొల్పబోతున్నారు.

First Published:  12 Nov 2024 3:34 PM GMT
Next Story