సివిల్స్ 2025 నోటిఫికేషన్ వచ్చేసింది
దరఖాస్తు చేసేందుకు ఫిబ్రవరి 11 వరకు చాన్స్
యునియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్‌సీ) సివిల్ సర్వీసెస్ -2025 నోటిఫికేషన్ ఇచ్చింది. ఈ ఏడాది ఆల్ ఇండియా సర్వీసుల్లో 979 పోస్టుల భర్తీకి సివిల్ సర్వీస్ ఎగ్జామినేషన్ ను నిర్వహించనుంది. ఈ రోజు నుంచి ఫిబ్రవరి 11వ తేదీ వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారు. ప్రిలిమ్స్ ఎగ్జామ్ మే 25న నిర్వహించనున్నారు. యూపీఎస్సీతో పాటు ఇండియన్ ఫారెస్ట్ సర్వీస్‌లో ఇంకో 150 పోస్టులతో మరో నోటిఫికేషన్ కూడా రిలీజ్ చేశారు. దీనికి దరఖాస్తు చేసేందుకు కూడా ఫిబ్రవరి 11వ తేదీనే ఆఖరు అని ప్రకటించారు. దేశంలోని ఏదైనా గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి బ్యాచిలర్ డిగ్రీ పూర్తి చేసిన 21 ఏళ్ల నుంచి 32 ఏళ్ల మధ్య వయసు వారు దరఖాస్తు చేసేందుకు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులకు గరిష్ట వయోపరిమితిలో మినహాయింపు ఉంటుంది. రూ.100 ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకోవాలి. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు ఫీజు నుంచి మినహాయింపు ఉంటుంది.
రెండు పేపర్లుగా ప్రిలిమినరీ పరీక్ష నిర్వహిస్తారు. మల్టిపుల్ చాయిస్ పద్ధతిలో 400 మార్కులకు నిర్వహించే ఈ పరీక్షలో నెగిటివ్ మార్కులు కూడా ఉంటాయి. ఇందులో అర్హత సాధించిన వారు మెయిన్స్ కు ఎంపికవుతారు. డిస్క్రిప్టివ్ పద్ధతిలో మెయిన్ పరీక్ష ఉంటుంది. అభ్యర్థులు ఎంపిక చేసుకున్న ఆప్షనల్స్ ఆధారంగా ఈ పరీక్ష నిర్వహిస్తారు. మెయిన్స్ లో అర్హత సాధించిన వారిని ఇంటర్వ్యూలకు ఎంపిక చేస్తారు. మెయిన్స్ తో పాటు ఇంటర్వ్యూలో స్కోర్ చేసిన మార్కుల ఆధారంగా ఆల్ ఇండియా సర్వీసెస్ కు అర్హులను ఎంపిక చేస్తారు. ప్రిలిమ్స్ పరీక్షలకు తెలంగాణలో హైదరాబాద్, వరంగల్, ఏపీలో విజయవాడ, తిరుపతి, విశాఖపట్నం, అనంతపురం కేంద్రాలుగా ఉంటాయి. మెయిన్స్ పరీక్షలను హైదరాబాద్, విజయవాడ కేంద్రాల్లో నిర్వహిస్తారు.