Telugu Global
National

ముఖ్యమంత్రికి యూజీసీ ముసాయిదాపై రివ్యూ చేసే తీరిక లేదా?

రాష్ట్రాల హక్కులు హరించేలా ఉన్నా స్పందించరా : మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి

ముఖ్యమంత్రికి యూజీసీ ముసాయిదాపై రివ్యూ చేసే తీరిక లేదా?
X

యూనివర్సిటీ గ్రాంట్స్‌ కమిషన్‌ (యూజీసీ) దేశంలోని విశ్వవిద్యాలయాల్లో తేవాల్సిన మార్పులపై ఈనెల 30వ తేదీలోగా అభిప్రాయాలు వెల్లడించాలని కోరినా ముఖ్యమంత్రి రేవంత్‌ రెడ్డికి ఈ అంశంపై సమీక్ష చేసే తీరికలేదా అని విద్యాశాఖ మాజీ మంత్రి సబితా ఇంద్రారెడ్డి ప్రశ్నించారు. బీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ ఆదేశాలతో గురువారం తెలంగాణ భవన్‌ లో పార్టీ ముఖ్య నాయకులు సమావేశమై యూజీసీ తలపెట్టిన మార్పులు, చేర్పులపై సమీక్షించిందని ఆమె వివరించారు. యూజీసీ రూపొందించిన ముసాయిదా రాష్ట్రాల హక్కులను హరించే విధంగా ఉందన్నారు. అభిప్రాయాలు చెప్పేందుకు ఇంకా వారం రోజుల సమయమే ఉన్నా రాష్ట్ర ప్రభుత్వంలో ఉలుకు పలుకు లేదన్నారు. విద్యా శాఖ మంత్రిగా ఉన్న సీఎం రేవంత్ రెడ్డి కి ఇంత ముఖ్యమైన అంశంపై సమీక్ష చేసే తీరిక దొరకకపోవడం దురదృష్టకరమన్నారు. యూజీసీ ప్రతిపాదనలు అమల్లోకి వస్తే వీసీల నియమకాల అధికారాలు రాష్ట్రం నుంచి కేంద్రం చేతుల్లోకి వెళ్తాయని.. దీనిని బీఆర్‌ఎస్‌ పూర్తిగా వ్యతిరేకిస్తుందన్నారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం సిఫార్సుల మేరకు సెర్చ్‌ కమిటీల ఆధారంగా వీసీల నియామకాలు జరుగుతున్నాయని.. యూజీసీ ముసాయిదా అమల్లోకి వస్తే ఈ ప్రక్రియ మొత్తం గవర్నర్‌ చేతుల్లోకి వెళ్తుందన్నారు. ఫెడరల్‌ స్ఫూర్తిని మంటగలిపేలా కేంద్రం తీసుకున్న ఈ నిర్ణయాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే దీనిపై స్పందించాలని డిమాండ్‌ చేశారు.

యూజీసీ ప్రతిపాదించిన ముసాయిదాలోని పదకొండు క్లాజులు రాష్ట్రాల ప్రయోజనాలు దెబ్బతీసేలా ఉన్నాయని మాజీ ఎంపీ బి. వినోద్‌ కుమార్‌ తెలిపారు. యూజీసీ ప్రతిపాదనలపై సమావేశంలో రెండున్నర గంటల పాటు చర్చించామని తెలిపారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలను యూజీసీకి పంపుతామని తెలిపారు. అలాగే యూజీసీ వెబ్‌సైట్‌లోనూ అప్‌లోడ్‌ చేస్తామన్నారు. సమావేశంలో ఎమ్మెల్యే డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డి, ఎమ్మెల్సీ సురభి వాణీ దేవి, మాజీ ఎంపీ రావుల చంద్రశేఖర్ రెడ్డి, సీనియర్‌ నాయకులు డాక్టర్ ఆర్ఎస్‌ ప్రవీణ్ కుమార్, డాక్టర్ దాసోజు శ్రవణ్, మాజీ ఎమ్మెల్యే పట్లోళ్ల శశిధర్ రెడ్డి ,ఒంటెద్దు నరసింహా రెడ్డి , కార్పొరేషన్ మాజీ చైర్మన్లు దేవీప్రసాద్, చిరుమళ్ల రాకేశ్‌ కుమార్, క్రిశాంక్, ఆంజనేయ గౌడ్, గెల్లు శ్రీనివాస్ యాదవ్, దూదిమెట్ల బాలరాజ్ యాదవ్,కె .వాసుదేవ రెడ్డి, బీఆర్ఎస్వీ ఉపాధ్యక్షుడు తుంగ బాలు తదితరులు పాల్గొన్నారు.


First Published:  23 Jan 2025 7:52 PM IST
Next Story