సీఈసీ రాజీవ్‌కుమార్‌కు బీజేపీ ఏ పదవిని ఆఫర్ చేసిందో?
అందుకే పదవీకాంక్షతో దేశ ప్రజాస్వామ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్నారని కేజ్రీవాల్ ఎన్నికల కమిషనర్‌పై తీవ్రమైన ఆరోపణలు
ఆమ్ ఆద్మీ పార్టీ అధినేత అరవింద్ కేజ్రీవాల్ ఎన్నికల సంఘం పనితీరుపై మండిపడ్డారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం ముందు ఈసీ లొంగిపోవడం చూస్తుంటే స్వతంత్ర సంస్థ తన ఉనికిని పూర్తిగా కోల్పోయినట్లు తెలుస్తోందని అన్నారు. ఈ నెలాఖరుకు రిటైర్ అవుతున్న ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీవ్‌కుమార్‌కు బీజేపీ ఏ పదవిని ఆఫర్ చేసిందని ప్రశ్నించారు. 'ఏ గవర్నర్ పదవినో లేదా రాష్ట్రపతి పదవినో ఇస్తామని ఆయనకు హామీ ఇచ్చి ఉంటుంది. అందుకే పదవీకాంక్షతో దేశ ప్రజాస్వామ్యాన్ని, భవిష్యత్తును నాశనం చేస్తున్నారు' అని కేజ్రీవాల్ ఎన్నికల కమిషనర్‌పై తీవ్రమైన ఆరోపణలు చేశారు. ఇకనైనా వ్యక్తిగత ప్రయోజనాలపై ఆలోచనలను వీడి చివరి కొద్దిరోజులైనా సీఈసీ తన విధులను న్యాయబద్ధంగా నిర్వర్తించాలని కోరుతున్నామన్నారు.
ఎన్నికల సమయం దగ్గర పడుతుండటంతో బీజేపీ గుండాలు, ఆప్ కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని అన్నారు. ఇంత జరుగుతున్నా చర్యలు తీసుకోవడానికి ఢిల్లీ పోలీసులు భయపడుతున్నారని పేర్కొన్నారు. ఒకవైపు తాము ఢిల్లీ ప్రజల అభివృద్ధికి పాటుపడుతూ నెలకు రూ. 25,00 ఆదా చేస్తుంటే.. మరోవైపు ఇతర పార్టీలు దేశ రాజధానికి సమస్యలు సృష్టించడానికి ప్రయత్నాలు చేస్తున్నాయని మండిపడ్డారు. ఢిల్లీలో 70 అసెంబ్లీ స్థానాలకు ఫిబ్రవరి 5న పోలింగ్ జరగనుండగా.. 8వ తేదీన ఓట్ల లెక్కింపు ఉంటుంది.