రేవంత్ ను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోంది
అదానీ వ్యవహారంపై రాజ్ భవన్ ముట్టడికి వెళ్లి కేసీఆర్ గురించి మాట్లాడిండు : మాజీ మంత్రి హరీశ్ రావు
రేవంత్ రెడ్డి సర్కస్ ఫీట్లను చూసి ఊసరవెల్లి కూడా సిగ్గు పడుతోందని మాజీ మంత్రి హరీశ్ రావు అన్నారు. అదానీతో రేవంత్ దోస్తీ చేస్తూ పార్టీ ఆదేశాలతో గల్లీలో కుస్తీ పడుతున్నట్టు నటిస్తున్నాడని అన్నారు. అసెంబ్లీ వాయిదా అనంతరం సీఎం సహా మంత్రులు, ఎమ్మెల్యేలు రాజ్ భవన్ ముట్టడికి వెళ్లగా.. బీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అసెంబ్లీ ఆవరణలో రేవంత్ రెడ్డి, అదానీ ఫొటోలతో నిరసన ప్రదర్శన చేపట్టారు. అనంతరం మీడియా పాయింట్‌లో హరీశ్ రావు మాట్లాడారు. అసెంబ్లీ సమావేశాల మొదటి రోజే అదానీ, రేవంత్ అక్రమ సంబంధాన్ని నిరసిస్తూ తాము టీ షర్ట్స్ వేసుకొని వస్తే సభలోకి రాకుండా అడ్డుకున్నారని గుర్తు చేశారు. అదానీతో దోస్తీ కారణంగానే తమను లోపలికి రానివ్వలేదన్నారు. రేవంత్ రెడ్డి అదానీ అవినీతిపై రాజ్‌భవన్ ముట్టడికి వెళ్లి అక్కడి కూడా కేసీఆర్, బీఆర్‌ఎస్ గురించి మాట్లాడాడే తప్ప అదానీ గురించి మాట్లాడలేదన్నారు. అదానీపై కాంగ్రెస్ పోరాటం నిజమే అయితే తమను అసెంబ్లీకి రాకుండా ఆ రోజు ఎందుకు అడ్డుకున్నారో చెప్పాలన్నారు. తాము డిమాండ్ చేస్తూ ఈ అంశంపై అసెంబ్లీలో చర్చ కూడా పెట్టడం లేదనక్నారు.
అదానీ అవినీతిపై రేవంత్ పోరాటం నిజమే అయితే.. ముందు దావోస్‌లో అదానీతో చేసుకున్న రూ.12,400 కోట్ల అగ్రిమెంట్లు రద్దు చేయాలని డిమాండ్ చేశారు. నేతి బీర కాయలో నెయ్యి ఎంతనో, రేవంత్ పోరాటంలో నిజాయితీ అంతేనన్నారు. రామన్నపేటలో డ్రైపోర్టు కోసం ల్యాండ్ ఇస్తే సిమెంట్ ఫ్యాక్టీరికి అనుమతి ఇచ్చారని, ఆదానీ కోసం పోలీసులను పెట్టి అరెస్టులు చేసి ప్రజలను ఇబ్బందులు పెడుతున్నారని తెలిపారు. పోలీస్ పహారా మధ్య పబ్లిక్ హియరింగ్ చేసి దానీకి ఏజెంట్‌గా రేవంత్ కొమ్ముకాస్తున్నాడని మండిపడ్డారు. అదానీ దేశం పరువు తీసిండని రాజ్ భవన్ వద్ద రేవంత్ అంటున్నాడని, దావోస్‌లో అదానీతో ఒప్పందాలు చేసుకొని నీవు తెలంగాణ పరువు తీశావని అన్నారు. అదానీకి రెడ్ కార్పెట్ పరిచి ఢిల్లీలో ఆయనపై పోరాటం చేస్తున్న రాహుల్ గాంధీ పరువు తీశామని అన్నారు. అదానీ, రేవంత్ అక్రమ సంబంధంపై రేపు అసెంబ్లీ చర్చ పెట్టాలని డిమాండ్ చేశారు. రాజ్‌భవన్ పై ట్రాఫిక్ జామ్ కు కారణమైన అందరిపై సీపీ సీవీ ఆనంద్ కేసులు పెట్టాలని డిమాండ్ చేశారు.