Telugu Global
National

ఐఏఎస్‌ అధికారులకు కేంద్రం షాక్‌

ఏ స్టేట్‌ క్యాడర్‌ లోని వాళ్లు ఆ స్టేట్‌ కు వెళ్లాల్సిందేనని ఆదేశం

ఐఏఎస్‌ అధికారులకు కేంద్రం షాక్‌
X

ఐఏఎస్‌ అధికారులకు కేంద్ర ప్రభుత్వం షాక్‌ ఇచ్చింది. ఏ స్టేట్‌ క్యాడర్‌ కు అలాట్‌ అయిన వాళ్లు ఆ స్టేట్‌ కు వెళ్లిపోవాల్సిందేనని తేల్చిచెప్పింది. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌ విభజన తర్వాత అప్పటికే ఏపీ క్యాడర్‌ ఆఫీసర్లుగా ఉన్నసివిల్‌ సర్వెంట్లను తెలంగాణ, ఏపీ క్యాడర్‌ లకు పంపిణీ చేసింది. ఇలా పంపిణీ చేసిన వారిలో పలువురు ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌ ఆఫీసర్లు తెలంగాణలో సర్వీస్‌ చేస్తున్నారు. తమ సర్వీస్‌ ను తెలంగాణకు కన్వర్షన్‌ చేయాలని డీవోపీటికి దరఖాస్తు చేసుకున్నారు. తెలంగాణ మాజీ సీఎస్‌ సోమేశ్‌ కుమార్‌ తో పాటు ప్రస్తుత జీహెచ్‌ఎంసీ కమిషనర్‌ ఆమ్రపాలి కాటా, వాకాటి కరుణ, రోనాల్డ్‌ రాస్‌, ఎం. ప్రశాంతి, వాణి ప్రసాద్‌ తెలంగాణలో పని చేస్తున్నారు. సోమేశ్‌ కుమార్‌ ను ఏపీలో రిపోర్ట్‌ చేయాలని గతంలోనే కేంద్రం ఆదేశించింది. ఏపీలో రిపోర్ట్‌ చేసిన కొన్ని రోజులకు ఆయన వాలంటరీ రిటైర్మెంట్‌ కు దరఖాస్తు చేసుకోగా అందుకు ఆ రాష్ట్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. తాజాగా మిగతా ఐఏఎస్‌ ఆఫీసర్లను ఏపీకి వెళ్లిపోవాల్సిందేనని డీవోపీటీ స్పష్టమైన ఆదేశాలు ఇచ్చింది. దీంతో తెలంగాణలో కీలక పోస్టుల్లో కొనసాగుతున్న ఐఏఎస్‌ ఆఫీసర్లు వాటిని వదులుకొని ఏపీలో రిపోర్ట్‌ చేయాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఐపీఎస్‌ ఆఫీసర్లలో ఏపీ క్యాడర్‌ కు చెందిన మాజీ డీజీపీ, ప్రింటింగ్‌ ప్రెస్‌ డీజీ అంజనీ కుమార్‌, అభిలాషా బిస్త్‌, అభిషేక్‌ మహంతి తెలంగాణలో పని చేస్తున్నారు. సోమేశ్‌ కుమార్‌ ఏపీలో రిపోర్ట్‌ చేయాలని ఆదేశించినప్పుడే తెలంగాణలో పని చేస్తున్న ఏపీ క్యాడర్‌ ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఆఫీసర్లు హైకోర్టును ఆశ్రయించారు. వీళ్లందరూ ఈనెల 16లోగా ఏపీలో రిపోర్ట్‌ చేయాలని డీవోపీటీ ఆదేశించింది.

సివిల్‌ సర్వెంట్లను కాపాడుకోవడంలో రేవంత్‌ ఫెయిల్‌

తెలంగాణ ప్రయోజనాల కోసం కేంద్ర ప్రభుత్వంతో సన్నిహిత సంబంధాలు నెరుపుతున్నామని పదే పదే చెప్పే సీఎం రేవంత్‌ రెడ్డి సివిల్‌ సర్వెంట్లను కాపాడుకోవడంలో ఘోరంగా ఫెయిల్‌ అయ్యారు. కీలక స్థానాల్లో పని చేస్తున్న ఐఏఎస్‌ ఆఫీసర్లను తెలంగాణలో కొనసాగించేలా కేంద్రంతో సీఎం లాబీయింగ్‌ చేసి ఉంటే నిర్ణయం ఇలా వచ్చేది కాదని ప్రభుత్వవర్గాల్లోనే చర్చ సాగుతోంది. సీఎం మాటలు చెప్పడం తప్ప కేంద్ర ప్రభుత్వ పెద్దలతో సరైన దిశలో సంప్రదింపులు జరపడం లేదని, ఢిల్లీలో కీలక పోస్టుల్లోనూ కేంద్రంతో సంప్రదింపులు జరపగల వ్యక్తులను పెట్టుకోలేదని అధికారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. పదేళ్ల పాటు తెలంగాణలో పని చేసిన అధికారులు ఉన్నట్టుండి ఏపీకి వెళ్లి పని చేయాలంటే సరైన ప్రాధాన్యత దక్కకపోవచ్చని చెప్తున్నారు. ఏపీ క్యాడర్‌ నుంచి డెప్యూటేషన్‌ పై వచ్చిన శ్రీనివాస రాజుకు డెప్యూటేషన్‌ కొనసాగించేందుకు కేంద్ర ప్రభుత్వం ససేమిరా అన్నదని గుర్తు చేస్తున్నారు. ఆయన ఏపీలో రిపోర్ట్‌ చేసి వాలంటరీ రిటైర్మెంట్‌ కు అప్లయ్‌ చేశారని, ఆమోదం లభించగానే తెలంగాణ ప్రభుత్వ అడ్వైజర్‌ (ఇన్‌ఫ్రాస్ట్రక్షర్‌ అండ్‌ ప్రాజెక్ట్స్‌) పదవి దక్కించుకున్నారని చెప్తున్నారు. ఏపీ నుంచి తెచ్చుకున్నవాళ్లను ఉన్నత స్థానాల్లో కూర్చోబెడుతున్న సీఎం రేవంత్‌ రెడ్డి, పదేళ్లుగా తెలంగాణలో పని చేస్తూ.. ఆయన ప్రభుత్వం కోసం పని చేస్తున్న వారిని కాపడటంతో ఘోరంగా విఫలమయ్యాయరని మండిపడుతున్నారు.



First Published:  10 Oct 2024 5:46 PM IST
Next Story