Telugu Global
National

జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం కేసు సీబీఐకి.. కోల్‌కతా హైకోర్టు ఆదేశం

కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌పై కోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆయన రాజీనామా చేసిన వెంటనే మరొక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది.

జూనియర్‌ డాక్టర్‌ హత్యాచారం కేసు సీబీఐకి.. కోల్‌కతా హైకోర్టు ఆదేశం
X

కోల్‌కతాలోని మెడికల్‌ కాలేజీ ఆస్పత్రిలో జూనియర్‌ డాక్టర్‌పై అత్యాచారం, హత్య ఘటనపై హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసు దర్యాప్తును సీబీఐకి బదిలీ చేయాలని పోలీసులను ఆదేశించింది. మంగ‌ళ‌వారం ఈ మేరకు హైకోర్టు ఆదేశాలు జారీ చేసింది. కేసుకు సంబంధించిన అన్ని దస్త్రాలను బుధవారం ఉదయం 10 గంటల్లోపు సీబీఐకి అందజేయాలని ఈ సందర్భంగా పేర్కొంది. ఈ కేసులో నిందితుడికి పోలీసులతో సంబంధాలు ఉన్నాయని ఆరోపణలు వస్తున్న నేపథ్యంలో సాక్ష్యాలు తారుమారు చేయకుండా ఉండేందుకు స్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలని బాధితురాలి తల్లిదండ్రులు కోరినట్లుగా న్యాయస్థానం పేర్కొంది.

గతంలో జరిగిన ఓ కేసులో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు ఆధారంగా న్యాయపరమైన దర్యాప్తు కోసం కేసును సీబీఐకి అప్పగిస్తున్నట్లు వెల్లడించింది. సెమినార్‌ హాలులో జూనియర్ డాక్ట‌ర్‌పై దారుణం జరుగుతుంటే ఆస్ప‌త్రిలో ఉన్నవారికి ఆ విషయం తెలియకపోవడం, యాజమాన్యం ఆలస్యంగా స్పందించడంపై కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. హత్యాచార ఘటనపై దేశవ్యాప్తంగా డాక్టర్లు నిరసన తెలుపుతున్న అంశంపైనా న్యాయస్థానం స్పందిస్తూ.. ప్రజల ప్రాణాలను కాపాడే పవిత్రమైన బాధ్యత వైద్యులపై ఉన్నందున.. ఆందోళనలను విరమించాలని సూచించింది. కళాశాల మాజీ ప్రిన్సిపల్‌ డాక్టర్‌ సందీప్‌ ఘోష్‌పై కోర్టు తీవ్రస్థాయిలో విరుచుకుపడింది. ఆయన రాజీనామా చేసిన వెంటనే మరొక పదవి ఎలా ఇస్తారని ప్రశ్నించింది. ఆయన్ను వెంటనే విధుల నుంచి తొలగించి, సెలవుపై పంపాల్సిందిగా ఆదేశించింది. మరోపక్క దేశ వైద్య విద్యా నియంత్రణ సంస్థ నేషనల్‌ మెడికల్‌ కమిషన్‌ దీనిపై స్పందిస్తూ.. ఈ ఘటనపై పూర్తిస్థాయి నివేదిక సమర్పించాలని కళాశాల యాజమాన్యాన్ని ఆదేశించింది.

First Published:  13 Aug 2024 7:05 PM IST
Next Story