Telugu Global
National

'మహాయుతి'లో మంత్రివర్గ విస్తరణ మంటలు

మంత్రివర్గంలో శాఖల కేటాయింపులపై శిండే అసంతృప్తి.. అందుకే హస్తిన పర్యటనకు దూరంగా ఉన్నారని వార్తలు

మహాయుతిలో మంత్రివర్గ విస్తరణ మంటలు
X

అసెంబ్లీ ఎన్నికల్లో భారీ విజయం సాధించినప్పటికీ సీఎం ఎంపిక విషయంలో మహాయుతి కూటమిలో నెలకొన్నభిన్నాభిప్రాయాలతో ఎన్డీఏ సర్కార్‌ కొలువుదీరడానికి ఆలస్యమైన సంగతి తెలిసిందే. అయినా ఇప్పటికీ మంత్రి పదవుల విషయంలో ఏకాభిప్రాయం కుదరలేదు. మంత్రివర్గ కూర్పుపై కూటమి నేతలు మల్లగుల్లాలు పడుతున్నారు. ఈ నేపథ్యంలోనే సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఢిల్లీలో బిజీబిజీగా గడుపుతున్నారు. ఫడ్నవీస్‌ నిన్న రాత్రి రక్షణ మంత్రి రాజ్‌నాథ్‌ సింగ్‌, రోడ్డు రవాణా శాఖమంత్రి నితిన్‌ గడ్కరీతో భేటీ అయ్యారు. ఆయన వెంట ఎన్‌సీపీ ఛీఫ్‌ అజిత్‌ పవార్‌ కూడా అక్కడే మకాం వేశారు. కానీ శివసేన అధినేత ఏక్‌నాథ్‌ శిండే మాత్రం కనిపించలేదు. సీఎం పదవి వదులుకొని డిప్యూటీ సీఎంగా కొనసాగడానికి అంగీకరించిన ఆయన ఇంకా శాంతించలేదని, మంత్రివర్గంలో శాఖల కేటాయింపులపై ఆయన అసంతృప్తిగా ఉన్నారని తాజా పరిణామాలను బట్టి తెలుస్తోంది.

అందుకే ఇప్పటికీ విస్తరణపై ప్రతిష్టంభన నెలకొన్నది. మంత్రివర్గ విస్తరణపై మహాయుతి కూటమి కొత్త ఫార్ములా రూపొందించింది. అయితే హోం శాఖను శివసేన (ఎస్పీ), ఎన్సీపీ (అజిత్‌ పవార్‌) ఆశిస్తున్నది. అయితే కొత్త ఫార్ములా ప్రకారం హోం శాఖ బీజేపీకే దక్కనున్నట్లు సమాచారం. మంత్రివర్గ విస్తరణపై చర్చించడానికి మహరాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్‌ ఢిల్లీ వెళ్లారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో కలిసి రాత్రి కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ను ఆయన నివాసంలో కలిశారు. కొత్త ఫార్ముల ప్రకారం బీజేపీకి 20 శాఖలు, శివసేనకు 12, ఎన్సీపీకి 10 బెర్తులు దక్కనున్నాయి. ఈ మేరకు మూడు పార్టీలు ఒక అంగీకారానికి వచ్చినట్లు సంబంధిత వర్గాలు చెబుతున్నాయి. ఎన్సీపీ చీఫ్‌ అజిత్‌ పవార్‌ కూడా ఢిల్లీ వెళ్లారు. హస్తిన పర్యటనకు ఏక్‌నాథ్‌ శిండే దూరంగా ఉండటంతో శాఖల కేటాయింపుపై ఆయన అసంతృప్తితో ఉన్నట్లు సమాచారం.

First Published:  12 Dec 2024 1:27 PM IST
Next Story