Forex Reserves- Gold | జీవిత కాల గరిష్టానికి ఫారెక్స్ రిజర్వ్ నిల్వలు.. ఇదీ అసలు సంగతి..!
మేం రోజురోజుకు బంగారం రిజర్వు నిల్వలు పెంచుతున్నాం. ఎప్పటికప్పుడు బంగారం కొనుగోళ్ల వివరాలు వెల్లడిస్తున్నాం అని ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు.
Forex Reserves- Gold | గతంలో ఎన్నడూ లేని విధంగా భారత్ ఫారెక్స్ మార్కెట్‌లో ఫారెక్స్ రిజర్వు నిల్వలు జీవిత కాల గరిష్టాన్ని తాకాయి. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం ఏప్రిల్-జూన్ త్రైమాసికం ఫారెక్స్ నిల్వల్లో బంగారం రిజర్వు నిల్వలు 69 శాతం ఉంటాయి. ధర పెరిగిపోవడంతోపాటు బంగారం కొనుగోలు చేయడంతో దాని విలువలోనూ, పరిమాణంలోనూ ఫారెక్స్ రిజర్వ్ నిల్వల్లో బంగారం వాటా పెరిగింది. ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ) 5.6 బిలియన్ల డాలర్ల విలువ గల బంగారం కొనుగోలు చేసింది. ఫారిన్ కరెన్సీ అసెట్స్ 1.9 బిలియన్ డాలర్లకు చేరితే, బంగారం రిజర్వుల విలువ 380 కోట్ల డాలర్లు ఉంటుంది. దీంతో 2024 జూన్ 28తో ముగిసిన వారానికి భారత్ ఫారెక్స్ రిజర్వు నిల్వలు 652 బిలియన్ డాలర్లకు చేరింది.
2024 మార్చి నెలాఖరు నుంచి మే నెలాఖరు వరకూ ఆర్బీఐ సుమారు తొమ్మిది టన్నుల బంగారం కొనుగోలు చేసింది. 2024 మార్చి నెలాఖరులో టన్ను బంగారం విలువ 63.44 మిలియన్ డాలర్లుగా ఉంటే, మే నెలాఖరు నాటికి 68 మిలియన్ డాలర్లకు చేరుకున్నది. వివిధ దేశాల్లోని కేంద్రీయ బ్యాంకులు బంగారం కొనుగోళ్లు చేపట్టడంతో బంగారం ధర పెరిగిపోవడానికి కారణం అని ప్రపంచ స్వర్ణ మండలి (డబ్ల్యూజీసీ) పేర్కొంది. బంగారం విలువ పెరగడానికి ఇదే కారణంగా కనిపిస్తున్నది.
మేం రోజురోజుకు బంగారం రిజర్వు నిల్వలు పెంచుతున్నాం. ఎప్పటికప్పుడు బంగారం కొనుగోళ్ల వివరాలు వెల్లడిస్తున్నాం అని ఇటీవల ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత దాస్ తెలిపారు. అన్ని కోణాల్లో పరిశీలించిన తర్వాత బంగారం రిజర్వు నిల్వలు పెంచాలని నిర్ణయించాం అని ఆయన చెప్పారు. విదేశీ కరెన్సీ రిస్క్‌లు, ద్రవ్యోల్బణం ప్రభావానికి అడ్డుకట్ట వేసేందుకు విదేశీ కరెన్సీ అసెట్స్‌లో వైవిధ్యం కోసం బంగారం రిజర్వ్ నిల్వలు పెంచాలని కేంద్రీయ బ్యాంకు లక్ష్యంగా పెట్టుకున్నది.
ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికంలో బంగారం కొనుగోళ్లు చేసిన వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకుల్లో భారతీయ రిజర్వు బ్యాంకు (ఆర్బీఐ)కి మూడో స్థానం ఉంటుంది. టర్కీ, చైనా తర్వాత భారత్ మాత్రమే అత్యధికంగా బంగారం కొనుగోలు చేస్తున్నది. 2022 ఫిబ్రవరిలో రష్యా-ఉక్రెయిన్ యుద్దం మొదలైన తర్వాత వివిధ దేశాల కేంద్రీయ బ్యాంకులు చురుగ్గా బంగారం నిల్వలు కొనుగోళ్లు చేస్తున్నాయి. ప్రపంచ దేశాల కేంద్రీయ బ్యాంకుల జాబితాలోనే ఆర్బీఐ వెళుతోంది. భౌగోళిక రాజకీయ ఉద్రిక్తతలు రోజురోజుకు పెరిగిపోతుండటంతో కేంద్రీయ బ్యాంకులు ముందు జాగ్రత్త చర్యగా బంగారం కొనుగోళ్లు జరుపుతున్నాయి. 2017 డిసెంబర్ నుంచి బంగారం కొనుగోళ్ల ప్రక్రియను ఆర్బీఐ చురుగ్గా ప్రారంభించింది.