Telugu Global
National

సుప్రీంకోర్టు తీర్పుపై మాయావతి కీలక వ్యాఖ్యలు

విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే.

సుప్రీంకోర్టు తీర్పుపై మాయావతి కీలక వ్యాఖ్యలు
X

ఎస్సీ వర్గీకరణ అంశంపై గురువారం నాడు సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుపై బీఎస్పీ అధినేత్రి, ఉత్తరప్రదేశ్‌ మాజీ ముఖ్యమంత్రి మాయావతి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎస్సీ వర్గీకరణ అంశంపై సుప్రీంకోర్టు తాజాగా ఇచ్చిన తీర్పుతో తమ పార్టీ ఏకీభవించడం లేదని స్పష్టం చేశారు. ఈ మేరకు ల‌క్నోలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడారు.

ఎస్సీ, ఎస్టీలకు సంబంధించిన రిజర్వేషన్ల ఉప వర్గీకరణకు సుప్రీంకోర్టు అనుమతించడాన్ని తమ పార్టీ అంగీకరించబోదని మాయావతి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. అఘాయిత్యాలను ఎస్సీ, ఎస్టీ ప్రజలు ఒక సమూహంగానే ఎదుర్కొన్నారని, ఈ వర్గమంతా సమానంగా ఉన్నందున ఉప వర్గీకరణ చేయడం సరికాదని ఆమె అభిప్రాయపడ్డారు.

విద్యా సంస్థల్లో ప్రవేశాలు, ప్రభుత్వ ఉద్యోగాల్లో ఎస్సీ, ఎస్టీలకు కేటాయించిన రిజర్వేషన్లను ఉపవర్గీకరణ చేసే అధికారం రాష్ట్ర ప్రభుత్వాలకు ఉంటుందని సుప్రీంకోర్టు గురువారం ఇచ్చిన తీర్పులో స్పష్టం చేసిన విషయం తెలిసిందే. 6 : 1 మెజారిటీతో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్‌ డి.వై.చంద్రచూడ్‌ సారథ్యంలోని ఏడుగురు సభ్యుల ధర్మాసనం ఈ చారిత్రక తీర్పును చెప్పింది. ఇందులో భాగంగా ఈ అంశంపై 2004లో ఐదుగురు సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో కూడిన ధర్మాసనం ఇచ్చిన తీర్పును తాజాగా పక్కన పెట్టడం గమనార్హం.

First Published:  4 Aug 2024 8:52 PM IST
Next Story