బీజేపీ 'మహా' స్ట్రైక్ రేట్.. 87.50 శాతం
ఎన్‌సీపీ 78, శివసేన 70 స్ట్రైక్ రేట్ తో ఘన విజయం
దేశ ఆర్థిక రాజధాని ముంబయి మహానగరం ఉన్న మహారాష్ట్రను పాలించేది ఎవరో తేలిపోయింది. అధికార మహాయుతి కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకుంది. బీజేపీ, శివసేన, ఎన్‌సీపీలతో కూటమి భారీ స్ట్రైక్ రేట్ తో ఫలితాల్లో దూసుకుపోయింది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వంలోని మహావికాస్ అఘాడీ కూటమి చతికిల పడింది. మహారాష్ట్రకు గుజరాత్ కు మధ్య జరుగుతోన్న పోరాటం, ప్రమాదంలో భారత రాజ్యాంగం, పార్టీల చీలికలు సహా ఏ ప్రచారం కూడా మహావికాస్ అఘాడీని నిలబెట్టలేకపోయింది. ఈనెల 20న మహారాష్ట్రలోని 288 స్థానాలకు పోలింగ్ నిర్వహించగా శనివారం ఓట్లు లెక్కించి ఫలితాలు ప్రకటించారు. ఎగ్జిట్ పోల్స్ అంచనాలకు మించి బీజేపీ కూటమి ఘన విజయం సాధించింది. ఈవీఎంల ట్యాంపరింగ్ తోనే బీజేపీ కూటమి గెలిచిందని శివసేన (యూబీటీ) నేత సంజయ్ రౌత్ విమర్శలు చేశారు. అంతటితో ఆగకుండా భారీగా డబ్బులు కుమ్మరించి బీజేపీ కూటమి గెలిచిందని చెప్పుకొచ్చారు. ఈ ఎన్నికలతో మరాఠా ప్రజలు బాలాసాహెబ్ వారసులు ఎవరో తేల్చేశారు. ఏక్‌నాథ్ శిందేనే నిజమైన వారసుడని తమ తీర్పు ద్వారా స్పష్టం చేశారు. లోక్‌సభ ఎన్నికల్లో భారీ విజయం దక్కించుకున్న మహావికాస్ అఘాడీ కూటమి కొన్ని నెలల్లోనే తేలిపోయింది. ఎన్ని హామీలిచ్చినా ప్రజలు వాళ్లను విశ్వాసంలోకి తీసుకోలేదు.
మహారాష్ట్రలోని 288 అసెంబ్లీ స్థానాలకు గాను 152 చోట్ల పోటీ చేసిన బీజేపీ 87.50 స్ట్రైక్ రేట్ తో 133 స్థానాలను గెలుచుకుంది. 52 సీట్లలో పోటీ చేసిన ఎన్‌సీపీ 78.85 స్ట్రైక్ రేట్ తో 41 సీట్లలో విజయం సాధించింది. శివసేన 81 సీట్లలో పోటీ చేసి 70.37 శాతం స్ట్రైక్ రేట్‌తో 57 సీట్లను దక్కించుకుంది. మహావికాస్ అఘాడీకి నాయకత్వం వహించిన కాంగ్రెస్ పార్టీ 101 స్థానాల్లో పోటీ చేసి 14.85 స్ట్రైక్ రేట్‌తో కేవలం 15 సీట్లను గెలుచుకుంది. 96 సీట్లలో పోటీ చేసిన శివసేన (యూబీటీ) 20.83 స్ట్రైక్ రేట్ తో 20 చోట్ల విజయం సాధించింది. 87 స్థానాల్లో పోటీ చేసిన ఎన్‌సీపీ (ఎస్‌పీ) 11.49 స్ట్రైక్ రేట్ తో 10 సీట్లను మాత్రమే గెలుచుకుంది. ఈ ఎన్నికల్లో ఉద్దవ్ ఠాక్రేతో పాటు మరాఠ యోధుడు శరద్ పవార్ నాయకత్వంపై ప్రజలు స్పష్టమైన తీర్పునిచ్చారు. బాలాసాహెబ్ వారసుడిగా ఏక్‌నాథ్ శిందే వైపే మొగ్గు చూపారు. శరద్ పవార్ ను కాదని ఆయన సోదరుడి కుమారుడు అజిత్ పవార్ దే నిజమైన నేషనలిస్టు కాంగ్రెస్ పార్టీ అని తమ తీర్పు ద్వారా తేల్చిచెప్పారు. కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో హామీలను అమలు చేయకపోయినా చేసినట్టు ప్రచారం చేసుకోవడం మహా వికాస్ అఘాడీకి ప్రతికూలంగా మారినట్టు అంచనా వేస్తున్నారు. ఆయా పార్టీల ముఖ్యనేతలెవరూ ఓటమిపై ఇప్పటి వరకు స్పందించలేదు.