27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమల వికాసం
అసెంబ్లీ ఎన్నికల్లో ఘన విజయం సాధించిన బీజేపీ
![27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమల వికాసం 27 ఏళ్ల తర్వాత ఢిల్లీలో కమల వికాసం](https://www.teluguglobal.com/h-upload/2025/02/08/1401548-bjp-delhi.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో 27 ఏళ్ల తర్వాత బీజేపీ విజయం సాధించింది. ఢిల్లీకి రాష్ట్ర హోదా కల్పించిన తర్వాత 1993లో జరిగిన ఎన్నికల్లో విజయం సాధించిన బీజేపీ ఆ తర్వాత మళ్లీ గెలవలేదు. ఐదేళ్ల కాలపరిమితిలోనే ముగ్గురు సీఎంలను బీజేపీ మార్చింది. 1993లో మదన్ లాల్ ఖురానా సీఎం కాగా ఆయనను తప్పించి సాహిబ్ సింగ్ వర్మకు పదవి కట్టబెట్టింది. ఆ తర్వాత సుష్మా స్వరాజ్ ఢిల్లీ సీఎం అయ్యారు. 1998లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ ఘన విజయం సాధించింది. షీలా దీక్షిత్ నాయకత్వంలో వరుసగా మూడు పర్యాయాలు కాంగ్రెస్ పార్టీ గెలిచింది. 2013లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో తొలిసారి పోటీ చేసిన ఆమ్ ఆద్మీ పార్టీ 28 స్థానాల్లో గెలిచింది. కాంగ్రెస్ మద్దతుతో కేజ్రీవాల్ సీఎం అయ్యారు. సంకీర్ణ ప్రభుత్వంలో కీలక నిర్ణయాలు తీసుకోలేకపోతున్నానని చెప్పి కేజ్రీవాల్ సీఎం పదవికి రాజీనామా చేయడంతో అసెంబ్లీ రద్దు అయ్యింది. 2015లో జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ 70 స్థానాలకు గాను 67 చోట్ల విజయం సాధించింది. 2020 ఎన్నికల్లో 62 స్థానాల్లో గెలిచింది. ఈ రెండు ఎన్నికల్లో 3, 8 సీట్లకు పరిమితం అయిన బీజేపీ ప్రస్తుత ఎన్నికల్లో మూడింట రెండు వంతుల మెజార్టీతో విజయం సాధించింది.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో మూడోసారి గెలిచి హ్యాట్రిక్ సాధించాలన్న అర్వింద్ కేజ్రీవాల్ ప్రయత్నాలకు బీజేపీ మొదటి నుంచి చెక్ పెడుతూ వచ్చింది. వ్యూహాత్మకంగా అడుగులు వేస్తూ ప్రచారం సాగించింది. హస్తినలో డబుల్ ఇంజన్ సర్కారు ఉంటేనే అభివృద్ది సాధ్యమని.. కేజ్రీవాల్ ను మళ్లీ గెలిపిస్తే కేంద్రంతో చీటికిమాటికీ పేచీలు పెట్టుకోవడం తప్ప అభివృద్ధి సాధ్యం కాదనే నరేటివ్ ను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగింది. యమునా నది ప్రక్షాళన, కాలుష్య నియంత్రణ తమతోనే సాధ్యమని ప్రజలను మెప్పించగలిగింది. ఢిల్లీ పేదలను ఆదుకునేందుకు ప్రకటించిన ఉచిత పథకాలు కూడా కమలం పార్టీకి కలిసి వచ్చాయి. తమ పార్టీని గెలిపిస్తే అభివృద్ధి గెలుస్తుందని ప్రజలను నమ్మించగలిగింది. సీఎం అభ్యర్థి ఎవరు అనేది చెప్పకుండానే మోదీ నాయకత్వానికి అండగా నిలువాలని పిలుపునిచ్చింది. కేజ్రీవాల్ ప్రభుత్వ అవినీతిని కూడా ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లింది. ఫలితంగానే అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ ఘన విజయం సొంతం చేసుకుంది. ఈ ఎన్నికల్లో తమ సత్తా చాటుతామని చెప్పిన కాంగ్రెస్ పార్టీ ఏ ఒక్క నియోజకవర్గంలోనూ అంతగా ప్రభావం చూపించలేకపోయింది. మైనార్టీ, దళిత ఓటర్లలో కాంగ్రెస్ తెచ్చిన చీలిక ఆమ్ ఆద్మీ పార్టీ పరాజయానికి దోహదం చేసి బీజేపీ గెలుపునకు ఉపయోగపడింది.
ఎలక్షన్ కమిషన్ అధికారిక లెక్కల ప్రకారం తుది ఫలితాలు ప్రకటించడానికి ఇంకో రెండు గంటల సమయం పట్టే అవకాశం ఉంది. ఇప్పటి వరకు పోలింగ్ శాతాన్ని చూసుకుంటే బీజేపీ 46.19 శాతం ఓట్లు దక్కించుకుంది. ఆమ్ ఆద్మీ పార్టీకి 43.54 శాతం ఓట్లు పోలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలతో పోల్చితే 3 శాతం ఓట్లు అదనంగా సాధించి 6.37 శాతం ఓట్లు దక్కించుకుంది. బీజేపీ 48 స్థానాల్లో, ఆమ్ ఆద్మీ పార్టీ 22 స్థానాల్లో ఆదిక్యంలో ఉన్నాయి. కాంగ్రెస్ పార్టీ ఈ ఎన్నికల్లో ఏ ఒక్క స్థానంలోనూ ఆదిక్యంలో లేదు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వెలువడుతుండగానే ఆ రాష్ట్ర సెక్రటేరియట్ ను సీజ్ చేయాలని లెఫ్టినెంట్ గవర్నర్ అధికారులను ఆదేశించారు. ఫైళ్లు, రికార్డులను భద్ర పరచాలని, ఏ ఒక్క ఫైల్ కూడా సెక్రటేరియట్ నుంచి బయటకు వెళ్‌లడానికి వీల్లేదని స్పష్టమైన ఆదేశాలు ఇచ్చారు.