ఆ రెండు రాష్ట్రాల్లో బీజేపీ గెలిస్తే జమిలి ఖాయం
సీపీఐ జాతీయ కార్యదర్శి నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు
మహారాష్ట్ర, జార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీని గెలిపిస్తే ప్రధాని మోదీ జమిలి ఎన్నికలకు సిద్ధమవుతారని సీసీఐ జాతీయ కార్యదర్శి కె. నారాయణ, రాష్ట్ర కార్యదర్శి కూనంనేని సాంబశివరావు అన్నారు. మంగళవారం హైదరాబాద్ లోని మగ్దుం భవన్ లో వారు మీడియాతో మాట్లాడారు. జమిలి ఎన్నికలు ఫెడరల్ స్ఫూర్తికి వ్యతిరేకమన్నారు. జమిలి ఎన్నికలు అనేక అనర్థాలకు దారితీస్తాయన్నారు. లౌకిక ప్రజాస్వామ్య వ్యవస్థకు భంగం కలిగించే రీతిలో మోదీ, అమిత్ షా రాజకీయాలు చేస్తున్నారని అన్నారు. అమిత్ షా కేంద్ర మంత్రి అయ్యాక నేరపూరిత రాజకీయాలకు ఆజ్యం పోస్తున్నారని మండిపడ్డారు. కుల గణన మంచి కార్యక్రమమని, అనవసరమైన ప్రశ్నలతో దానిని వివాదాస్పదం చేసుకోవద్దని రాష్ట్ర ప్రభుత్వానికి సూచించారు. వికారాబాద్ కలెక్టర్ పై దాడి చేయడం మంచిది కాదని, అదే సమయంలో రైతుల బాధ, వారి ఆవేదన కూడా అర్థం చేసుకోవాలని ప్రభుత్వానికి సూచించారు. దాడి చేసిన వాళ్లు ఒక పార్టీకి చెందిన వారు అని ముద్ర వేసి చర్యలు తీసుకోవద్దన్నారు. సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి ఇంటికి ప్రధాని వెళ్లడం, ఆయనను ప్రధాన న్యాయమూర్తి ఆహ్వానించడం రెండూ తప్పేనని, ఇది దుష్ట సంప్రదాయమని అన్నారు. న్యాయవ్యవస్థ లక్ష్మణరేఖను దాటొద్దన్నారు. ఏపీలో టీడీపీ, వైసీపీని మోదీ తన గుప్పిట్లో పెట్టుకున్నారని అన్నారు. ఈనెల 17న కొల్లేరు సరస్సు సందర్శిస్తానని నారాయణ తెలిపారు. మోదీ విష కౌగిలిలో చంద్రబాబు ఉన్నారని ఆరోపించారు. కేటీఆర్ కు రక్షణ కవచం కావాలని, అందుకే ఆయనకు కమ్యూనిస్టులు గుర్తుకు వస్తున్నారని సాంబశివరావు అన్నారు. తాము ప్రజలకు మాత్రమే రక్షణ కవచంగా ఉంటామన్నారు. రాష్ట్ర ప్రస్తుత ఆర్థిక పరిస్థితిపై శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వరుసగా జరుగుతున్న ఘటనల వెనుక ఉన్న శక్తి ఏమిటో నిగ్గు తేల్చాలన్నారు. హైదరాబాద్ లో 144 సెక్షన్ విధించడం మంచిది కాదన్నారు. కాంగ్రెస్ హామీల్లో కొన్ని మాత్రమే అమలు చేశారని, ఇంకా చేయాల్సినవి చాలా ఉన్నాయన్నారు. మూసీ, హైడ్రాపై ఈనెల 14న మేధావులతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నామని తెలిపారు.