బీజేపీ ఒక ఉగ్రవాదుల పార్టీ
కాంగ్రెస్‌ను అర్బన్ నక్సలైట్లు నడిపిస్తున్నారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై మండిపడిన మల్లికార్జున ఖర్గే
బీజేపీ ఉగ్రవాదుల పార్టీని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే తీవ్ర ఆరోపణలు చేశారు. కాంగ్రెస్‌ను అర్బన్ నక్సలైట్లు నడిపిస్తున్నారన్న ప్రధాని మోడీ వ్యాఖ్యలపై ఖర్గే మండిపడ్డారు. ఎన్నో హత్యలతో సంబంధం ఉన్న బీజేపీనే ఒక ఉగ్రవాదుల పార్టీని ఖర్గే విమర్శించారు. అలాంటి పార్టీ నుంచి వచ్చిన మోడీకి కాంగ్రెస్‌పై నిందలు వేసే హక్కులేదన్నారు.
ఇటీవల మహారాష్ట్రలో ప్రసంగించిన మోడీ అర్బన్ నక్సలైట్స్ గ్రూప్ కాంగ్రెస్ పార్టీని నడుపుతున్నదని, ఆపార్టీ ప్రమాదకర అజెండాను ప్రజలంతా కలిసికట్టుగా ఓడించాలని వ్యాఖ్యానించారు. హర్యానా అసెంబ్లీ ఎన్నికల్లో విజయం తర్వాత మోడీ ఇదే పదాన్ని ఉపయోగించారు. ఈ నేపథ్యంలో ఖర్గే వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నది.
బీజేపీ ఎదురుదాడి
ఖర్గే వ్యాఖ్యలపై బీజేపీ ఎదురుదాడికి దిగింది. ఉగ్రవాదులకు మద్దతు తెలిపే పార్టీ తమపై నిందలు మోపడం విడ్డూరంగా ఉన్నదని కేంద్రమంత్రి గిరిరాజ్ సింగ్ విమర్శించారు. ఖర్గే తన పార్టీ గురించి చెప్పబోయి పొరపాటున బీజేపీ అని చెప్పారని మరో మంత్రి ప్రహ్లాద్ జోషి ఎద్దేవా చేశారు. ఢిల్లీలో బాట్లాహౌస్ ఎన్‌కౌంటర్‌లో ఉగ్రవాదులు చనిపోతే సోనియాగాంధీ కన్నీళ్లు పెట్టుకున్నారని ఆరోపించారు. పార్లమెంటుపై దాడికి పాల్పడిన అఫ్జల్ గురుపై కాంగ్రెస్ మెతక వైఖరిని అవలంబించిందని ఎక్స్‌లో పోస్ట్ చేశారు. ఉగ్రవాదుల కార్యకలాపాలు నిరోధించడానికి తెచ్చిన పోటా చట్టాన్ని 2004లో కాంగ్రెస్ రద్దు చేసిందని ఆగ్రహం వ్యక్తం చేశారు. కశ్మీర్ వేర్పాటువాదులతో మాజా ప్రధాని మన్మోహన్ సింగ్ కరచాలనం చేయడం చేయలేదా? అని ప్రశ్నించారు. ప్రధాని మోడీ హయాంలో నే ఉగ్రవాదుల కార్యకలాపాలు గణనీయంగా తగ్గాయని అన్నారు. విభజించు-పాలించు అన్న బ్రిటిష్ వలసవాద భావజాలం మాదిరిగా ఖర్గే వ్యాఖ్యలు ఉన్నాయని బీజేపీ అధికార ప్రతిని కేశవన్ విమర్శించారు.