ఎట్టకేలకు గాడిదను పంపేసిన బిగ్‌బాస్ టీమ్
హిందీ బిగ్ బాస్ రియాలిటీ షోలో గాడిదను కంటెస్టెంట్‌గా తీసుకోవడంపై సర్వత్రా విమర్శలు
హిందీ బిగ్ బాస్ రియాలిటీ షో ఎంతో ప్రాచుర్యం పొందింది. ప్రస్తుతం 18వ సీజన్ ప్రసారమౌతున్నది. గాడిదను కంటెస్టెంట్‌గా తీసుకోవడంతో తాజాగా ఈ షో వార్తలో నిలిచింది. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమయ్యాయి. గాడిదను తొలిగించాలని కోరుతూ 'పెటా ఇండియా' బిగ్‌బాస్ మేనేజ్‌మెంట్‌కు లేఖ రాసింది. దీనిపై స్పందించిన యాజమాన్యం బిగ్‌బాస్ టీమ్ గాడిదను విడుదల చేసినట్లు ఇన్‌స్టా వేదికగా తెలిపింది. బిగ్‌బాస్‌ను ఆదరిస్తున్నందుకు, మద్దతుగా నిలుస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపింది. అందరి సమష్టి కృషి వల్లనే ఈ షో ఇంత సక్సెస్‌ఫుల్‌గా సాగుతున్నదని టీమ్ వెల్లడించింది.
హిందీ బిగ్‌బాస్ 18వ సీజన్ అక్టోబర్ 6న ప్రారంభమైంది. ఇందులో కంటెస్టెంట్‌గా గాడిదను హౌజ్‌లోకి పంపారు. దీంతో పెటా ఇండియా బిగ్‌బాస్ టీమ్‌తో పాటు సల్మాన్‌ఖాన్‌కూడా లేఖ రాసింది. మీ పలుకుబడిని ఉపయోగించి రియాలిటీ షో నిర్మాతలను ఒప్పించండి. గాడిదను సెట్స్ నుంచి తొలిగించి మాకు అప్పగించండి అని సల్మాన్‌కు విజ్ఞప్తి చేసింది. జంతువులను వినోదం కోసం ఇలా వినియోగించవద్దని కోరింది. ఇలాంటి చర్యలు మానుకోవాలని తెలిపింది. బిగ్‌బాస్ స్టేజ్‌పై ఆ గాడిదను సల్మాన్ గద్‌రాజ్ అని పిలుస్తూ.. 'ఒకవేళ నువ్వు గెలిస్తే.. నిన్ను ఎలా ఎత్తుకోవాలి.. నీ చెవులు పట్టుకుని నిన్ను ఎత్తుకుంటాను' అని గాడిదతో మాట్లాడారు. ఇలా మాట్లాడటంపైనా కొందరు అభ్యంతరం చెప్పారు. సర్వత్రా విమర్శలు రావడంతో బిగ్‌బాస్ యాజమాన్యం చివరికి గాడిదను సెట్స్ నుంచి బైటికి పంపించేయడంతో వివాదం సమసిపోయింది.