Telugu Global
National

డిజిటల్‌ అరెస్టులు, ఆన్‌లైన్‌ స్కామ్‌లపై అవగాహన అవసరం

మన్‌ కీ బాత్‌లో డిజిటల్‌ అరెస్ట్‌లు, స్కామ్‌లపై అప్రమత్తం చేసిన ప్రధాని

డిజిటల్‌ అరెస్టులు, ఆన్‌లైన్‌ స్కామ్‌లపై అవగాహన అవసరం
X

డిజిటల్‌ అరెస్టులు, ఆన్‌లైన్‌ స్కామ్‌లపై ప్రజలకు అవగాహన అవసరమని ప్రధాని నరేంద్రమోడీ అభిప్రాయపడ్డారు. 'మన్‌ కీ బాత్‌( 115 ఎపిసోడ్‌లో ఆయన ప్రసంగించారు. దీపావళి పండుగకు ముందుగానే శుభాకాంక్షలు తెలియజేశారు. యానిమేషన్‌, గేమింగ్‌ పరిశ్రమలపై ప్రధాని ప్రశంసల జల్లు కురిపించారు. డిజిటల్‌ అరెస్టుల పేరుతో అమాయకుల నుంచి డబ్బు వసూలు చేస్తున్న సైబర్‌ నేరస్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ప్రధాని నరేంద్రమోడీ సూచించారు. ఏ దర్యాప్తు సంస్థా ఫోన్‌ లేదా విడియో కాల్‌ ద్వారా విచారణ చేపట్టదని ప్రధాని స్పష్టం చేశారు. కాబట్టి పోలీసులు పేరుతో డిజిటల్‌ నేరస్తులు చేస్తున్న సైబర్‌ మోసాల పట్ల జాగ్రత్తగా ఉండాలని కోరారు. మన్‌ కీ బాత్‌ ద్వారా ప్రజలతో అభిప్రాయాలు పంచుకున్న ప్రధాని డిజిటల్‌ అరెస్టుల పేరుతో ఎవరైనా భయపెడితే నేషనల్‌ సైబర్‌ హెల్ప్‌ లైన్‌ 1930కు ఫోన్‌ చేయాలని సూచించారు. సైబర్‌ క్రైమ్‌లో పోలీసులకు ఫిర్యాదు చేయవచ్చన్నారు.

'మళ్లీ చెబుతున్నాను. డిజిటల్‌ అరెస్ట్‌ అనేది చట్టంలో లేదు. ఇది ఒక మోసం, కపటం, అబద్ధం. నేరస్తులు చేసే పని. డిజిటల్‌ అరెస్టు పేరుతో జరిగే మోసాలను అరికట్టడానికి అన్ని దర్యాప్తు సంస్థలు రాష్ట్ర ప్రభుత్వాలతో కలిసి పనిచేస్తున్నాయి. దర్యాప్తు సంస్థలు మోసగాళ్ల వేలాది వీడియో కాలింగ్‌ ఐడీలను బ్లాక్‌ చేశాయి. లక్షలాది సిమ్‌ కార్డులు, మొబైల్‌ ఫోన్లు, బ్యాంక్‌ ఖాతాలను బ్లాక్‌ చేశాయి. దర్యాప్తు సంస్థలు వాటి పని చేస్తున్నాయి. అయినప్పటికీ డిజిటల్‌ అరెస్టు పేరుతో జరుగుతున్న మోసాల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం అత్యావశ్యకం. ప్రతి ఒక్కరూ జాగ్రత్తగా ఉండాలి. ప్రతి పౌరడూ అప్రమత్తంగా ఉండాలి.

యానిమేషన్‌ రంగంలో రాణిస్తున్న భారతీయ గేమ్‌లకు ప్రధాని ప్రశంసించారు. కల్పనా శక్తితో కూడిన గాలి దేశవ్యాప్తంగా వీస్తున్నదని కొనియాడారు. యానిమేషన్‌ రంగంలో మేడ్‌ ఇన్‌ ఇండియా ప్రతిభ మెరుస్తుందన్నారు. చోటా భీమ్‌, కృష్ణ, మోటా పెట్‌ వంటి కార్టూన్‌ పాత్రలు బాగా పాపులర్‌ అయ్యాయని ప్రధాని గుర్తు చేశారు. భారతీయ గేమ్‌లకు ప్రాచుర్యం పెరుగుతుందన్నారు. అన్ని రంగాల్లో ఆత్మ నిర్బర్‌ భారత్‌ కనిపిస్తుందన్నారు. వర్చువల్‌ రియాలిటీ టూరిజం నేడు ప్రసిద్ధి చెందుతోంది. అక్టోబర్‌ 28న 'వరల్డ్‌ యానిమేషన్‌ డే' జరుపుకోనున్నాం. భారత్‌ను గ్లోబల్‌ యానిమేషన్‌ పవర్‌ హౌస్‌గా మార్చడానికి సంకల్పించాలన్నారు. భారత్‌ 80 దేశాలకు రక్షణ ఉత్పత్తులు ఎగుమతి చేస్తుందన్నారు.

First Published:  27 Oct 2024 2:28 PM IST
Next Story