ఏక్‌నాథ్ శిండేను పక్కనపెట్టే ప్రయత్నాలు
శివసేన నేత సంజయ్ శిర్సాట్ సంచలన వ్యాఖ్యలు
మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో మహాయుతి కూటమి భారీ విజయాన్ని సొంతం చేసుకున్నా సర్కార్ ఏర్పాటులో మాత్రం ఏకాభిప్రాయానికి రాలేకపోతున్నది. సీఎం ఎంపిక, శాఖల కేటాయింపులపై పార్టీల మధ్య చర్చలు ఇంకా కొలిక్కి రాలేదు. దీంతో కొత్త ప్రభుత్వం కొలువుదీరడం మరింత ఆలస్యమ్యే సూచనలు కనిపిస్తున్నాయి. మరోవైపు ఆపద్ధర్మ సీఎం ఏక్‌నాథ్ శిండే కూటమి ముఖ్యనేత భేటీని రద్దు చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఈ నేపథ్యంలోనే శివసేన నేత సంజయ్ శిర్సాట్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కొత్త ప్రభుత్వంలో శిండేను పక్కనపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని బాంబ్ పేల్చారు.
శిండే నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం వల్ల ఈ ఎన్నికల్లో బీజేపీకి లబ్ధి చేకూరింది. కొన్ని పథకాలకు ఎన్‌సీపీ అభ్యంతరం చెప్పినప్పటికీ శిండే వాటిపై ముందుకు వెళ్లారు. అవన్నీ ఎన్నికల్లో కూటమికి ఓట్లు సంపాదించి పెట్టాయి. సాధారణంగా హోం శాఖను డిప్యూటీ సీఎంకే ఇస్తారు. ఇప్పుడు బీజేపీ సీఎం పదవి తీసుకుంటే హోంశాఖను శివసేనకు ఇవ్వాలి. అలా కాదని సీఎం వద్దే ఉంచుకోవడం సరికాదు. కొత్త ప్రభుత్వంలో శిండేకు కీలక శాఖలు ఇవ్వకుండా పక్కనపెట్టడానికి ప్రయత్నాలు జరుగుతున్నట్లు తెలుస్తోందని సంజయ్ శిర్సాట్ ఆరోపించారు.
24 గంటల్లో శిండే భవిష్యత్తు కార్యాచరణ?
మహారాష్ట్రలో ప్రభుత్వ ఏర్పాటుపై ఢిల్లీలో చర్చలు జరిగినప్పటికీ ఇంకా ఎలాంటి ప్రకటన వెలువడలేదు. మొన్న కేంద్ర హోం మంత్రితో ఏక్‌నాథ్ శిండే, దేవేంద్ర ఫడ్నవీస్, అజిత్ పవార్ భేటీ అయిన సంగతి తెలిసిందే. షాతో భేటీ అనంతరం మహారాష్ట్రకు బయలుదేరే ముందు మీడియాతో మాట్లాడిన శిండే 'సీఎం ఎవరనే దానిపై బీజేపీ తీసుకునే నిర్ణయానికి పూర్తి మద్దతు ఇస్తాను. ముంబయిలో కూటమి నేతల మధ్య చర్చలు జరిగిన అనంతరం రెండు, మూడు రోజుల్లో దీనిపై నిర్ణయాన్ని ప్రకటిస్తాం' అని వెల్లడించారు. అయితే ఆ తర్వాతే కొన్ని గంటలకే ఆ సమావేశాన్ని రద్దు చేసుకుని సొంతూరుకు వెళ్లిపోయారు. దీంతో సీఎం ఎంపిక, శాఖల కేటాయింపులపై విషయంలో కూటమి నిర్ణయంతో ఆయన అసంతృప్తితో ఉన్నట్లు ప్రచారం జరుగుతున్నది. అయితే ఆయన అనారోగ్య సమస్యలతో ఊరికి వెళ్లినట్లు మరికొంతమంది నేతలు చెబుతున్నారు. మరోవైపు తన భవిష్యత్తు కార్యాచరణపై శిండే 24 గంటల్లో కీలక ప్రకటన చేసే అవకాశం ఉన్నట్లు ఊహాగానాలు వినిపిస్తున్నాయి. దీంతో ఆయన మహాయుతి కూటమిలో కొనసాగుతారా? లేదా అనే అనుమానాలు వ్యక్తమౌతున్నాయి.
కొత్త సీఎం ఫడ్నవీసా? మురళీధర్ మాహోలా?
ఇదిలా ఉంటే మహారాష్ట్ర తదుపరి సీఎంగా దేవేంద్ర ఫడ్నవీస్ దాదాపు ఖాయమనే ప్రచారం జరుగుతున్నది. అయితే శిండే వర్గం దీనిపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. మహారాష్ట్ర సామాజిక సమీకరణాలను, స్థానిక పరిస్థితుల ఆధారంగా సీఎం ఎంపికపై ముందుకు వెళ్లాలని బీజేపీ హైకమాండ్ యోచిస్తున్నట్లు వార్తలు వచ్చాయి. ఈ నేపథ్యంలో రేసులో కొత్త మరళీధర్ మాహోల్ పేరు తెరపైకి వచ్చింది. బీజేపీ పూణె ఎంపీ అయిన మురళీ ధర్ ప్రస్తుతం కేంద్ర పౌర విమానయాన శాఖ సహాయ మంత్రిగా ఉన్నారు. ఒకవేళ ఆయనను సీఎంగా ఎంపిక చేస్తే దేవంద్ర ఫడ్నవీస్‌ను బీజేపీ అధ్యక్షుడిగా నియమిస్తారనే ప్రచారమూ జరుగుతున్నది.