Telugu Global
National

7 రాష్ట్రాల బై పోల్స్‌లో ఇండియా కూటమి హవా

ఉప ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి సత్తా చాటుతోంది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరుగగా.. ఇవాళ ఫలితాలు వెలువడుతున్నాయి.

7 రాష్ట్రాల బై పోల్స్‌లో ఇండియా కూటమి హవా
X

దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జరిగిన ఉప ఎన్నికల్లో ఇండియా కూటమి ఎన్డీయే కూటమిపై స్పష్టమైన ఆధిక్యత కనబరుస్తోంది. 13 స్థానాలకు గానూ 11 స్థానాల్లో ఇండియా కూటమి ఆధిక్యంలో కొనసాగుతుండగా ఎన్డీయే కూటమి కేవలం రెండు స్థానాల్లో మాత్రమే ముందంజలో ఉంది.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో 400కు పైగా స్థానాల్లో గెలుస్తామని ప్రకటిస్తూ వచ్చిన ఎన్డీయే కూటమి మ్యాజిక్ మార్క్ కూడా దాటలేక మిత్రపక్షాల సహాయంతో కేంద్రం ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. ఇటీవ‌ల జ‌రిగిన‌ సార్వత్రిక ఎన్నికల్లో కేవలం 99 స్థానాలకే పరిమితమైన కాంగ్రెస్, దాని మిత్రపక్షాలు ఈసారి ఇండియా కూటమిగా ఏర్పడి 200కు పైగా ఎంపీ స్థానాలు గెలుపొందాయి.

ఇప్పుడు ఉప ఎన్నికల్లో కూడా ఇండియా కూటమి సత్తా చాటుతోంది. దేశవ్యాప్తంగా ఏడు రాష్ట్రాల్లోని 13 అసెంబ్లీ స్థానాలకు జూలై 10న ఉప ఎన్నికలు జరుగగా.. ఇవాళ ఫలితాలు వెలువడుతున్నాయి. ఉదయం 8 గంటల నుంచి కౌంటింగ్ ప్రారంభం కాగా.. మొత్తం 13 స్థానాలకు గాను 11 చోట్ల ఇండియా కూటమి అభ్యర్థులు స్పష్టమైన ఆధిక్యంలో నిలిచారు. మరో రెండు చోట్ల మాత్రమే ఎన్డీయే అభ్యర్థులు ఆధిక్యంలో కొనసాగుతున్నారు.

సార్వత్రిక ఎన్నికల్లో సొంతంగా సత్తా చాటలేక మిత్రపక్షాలతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఎన్డీయే ఉప ఎన్నికల్లోనూ ఆశించినంతగా ప్రభావం చూపలేకపోయింది. ఉప ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కాంగ్రెస్ కూటమిలో మరింత ఉత్సాహాన్ని నింపాయి.

First Published:  13 July 2024 7:19 AM GMT
Next Story