ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీజేపీ ఆఫర్
అలర్ట్ అయిన కేజ్రీవాల్.. నేడు ఎమ్మెల్యే అభ్యర్థులతో అత్యవసర సమావేశం
![ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీజేపీ ఆఫర్ ఆప్ ఎమ్మెల్యే అభ్యర్థులకు బీజేపీ ఆఫర్](https://www.teluguglobal.com/h-upload/2025/02/07/1401142-aaap.webp)
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు ముందే అనేక కీలక పరిణామాలు చకచకా జరిగిపోతున్నాయి. తమ పార్టీలో గెలుస్తారనే అంచనా ఉన్న ఎమ్మెల్యే అభ్యర్థులకు బీజేపీ నాయకులు ఫోన్‌లు చేసి ఆహ్వానిస్తున్నారని ఆప్ నేత సంజయ్ సింగ్ ఆరోపించారు. ఒక్కో ఎమ్మెల్యే అభ్యర్థికి రూ.1.50 కోట్లు ఇస్తామని చెప్తున్నారని వెల్లడించారు. శనివారం ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపు జరగనుంది. బీజేపీ ప్రలోభాల నేపథ్యంలో అర్వింద్ కేజ్రీవాల్ అలర్ట్ అయ్యారు. శుక్రవారం తమ పార్టీ తరపున పోటీ చేసిన 70 మంది ఎమ్మెల్యే అభ్యర్థులతో అత్యవసరంగా సమావేశమవుతున్నారు.
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో పోటీ చేసిన 70 మంది ఆమ్ ఆద్మీ పార్టీ అభ్యర్థులతో పార్టీ చీఫ్ అర్వింద్ కేజ్రీవాల్ శుక్రవారం సమావేశం కానున్నారు. ఈనెల 5న జరిగిన పోలింగ్‌లో బీజేపీ, ఆమ్ ఆద్మీ పార్టీలు హోరాహోరీగా తలపడ్డాయి. అనేక సర్వే సంస్థలు ఎగ్జిట్ పోల్ లో బీజేపీనే విజయం సాధిస్తుందని అంచనా వేశాయి. తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ అయిన కేకే సర్వే మాత్రం కేజ్రీవాల్ హ్యాట్రిక్ కొట్టడం పక్కా అని ధీమాగా చెప్పారు. ఆప్ అంతర్గత సర్వేలో సైతం విజయం సాధిస్తామని తేలిందని చెప్తున్నారు. ఒకవేళ రెండు పార్టీలకు పోటాపోటీగా ఎమ్మెల్యే సీట్లు వస్తే ఎలా అనే సందేహంలో కేజ్రీవాల్ ఉన్నట్టు తెలుస్తోంది. ఈక్రమంలో ఎమ్మెల్యేలతో సమావేశం ఏర్పాటు చేశారని తెలుస్తోంది. ముఖ్యంగా గెలుపు గుర్రాలుగా భావిస్తోన్న ఎమ్మెల్యే అభ్యర్థులు చేజారకుండా ముందు జాగ్రత్తగానే ఈ సమావేశం నిర్వహిస్తున్నారని చెప్తున్నారు.