రాష్ట్రపతి పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి
అధికారులకు సీఎస్ శాంతికుమారి ఆదేశం
రాష్ట్రపతి ద్రౌపది ముర్ము హైదరాబాద్ పర్యటనకు పకడ్బందీ ఏర్పాట్లు చేయాలని అధికారులను సీఎస్ శాంతికుమారి ఆదేశించారు. ఈనెల 17 నుంచి 21 వరకు హైదరాబాద్‌లో రాష్ట్రపతి పర్యటన నేపథ్యంలో మంగళవారం సెక్రటేరియట్‌లో ఆమె ఉన్నతాధికారులతో రివ్యూ చేశారు. బొల్లారంలోని రాష్ట్రపతి నిలయంతో పాటు ఆవరణలో ఫారెస్ట్ అధికారులు ప్రత్యేక పాములు పట్టే బృందాలను ఏర్పాటు చేయాలని, ఆ టీమ్‌లు 24 గంటలు అక్కడే ఉండి సమీపంలోని అన్ని పాములు పట్టేలా చర్యలు తీసుకోవాలన్నారు. కోతుల బెడతను నివారించాలని, రాష్ట్రపతి నిలయం ఆవరణలోని తేనెతెట్టెలు ముందుగానే తొలగించాలని ఆదేశించారు. కేంద్ర ప్రభుత్వ శాఖలతో రాష్ట్ర పోలీసులు, ఇతర శాఖల అధికారులు సమన్వయం చేసుకుంటూ అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రాష్ట్రపతి నిలయం పరిసరాల్లో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేయాలన్నారు. సమీక్షలో డీజీపీ జితేందర్, స్పెషల్ సీఎస్‌లు రవి గుప్తా, వికాస్ రాజ్, ఫైర్ సర్వీసెస్ డీజీ నాగిరెడ్డి, జీఏడీ సెక్రటరీ రఘునందన్ రావు, ఐ అండ్ పీఆర్ కమిషనర్ హరీశ్, ప్రొటోకాల్ డైరెక్టర్ వెంకట్ రావు, ఇతర అధికారులు పాల్గొన్నారు.