Telugu Global
National

బిహార్‌లో కూలిన 12వ వంతెన.. - 17 రోజుల వ్యవధిలో కూలిపోయిన 12 వంతెనలు

కూలిపోయిన వంతెనలన్నీ దాదాపు 30 ఏళ్ల క్రితం నాటివని, పునాదులు లోతుగా లేకపోవడంతో పూడిక తీత సమయంలో దెబ్బతిని కూలిపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు.

బిహార్‌లో కూలిన 12వ వంతెన.. - 17 రోజుల వ్యవధిలో కూలిపోయిన 12 వంతెనలు
X

ఒకటి కాదు రెండు కాదు.. వరుసగా 12 వంతెనలు కుప్పకూలిపోయాయి.. అదీ 17 రోజుల వ్యవధిలోనే.. బిహార్‌లో చోటుచేసుకుంటున్న ఈ ఘటనలు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారాయి. తాజాగా సరన్‌ జిల్లాలో భారీ వంతెన కుప్పకూలిపోయిన నేపథ్యంలో దీనిపై రాష్ట్ర జలవనరుల శాఖ అదనపు ప్రధాన కార్యదర్శి చైతన్య ప్రసాద్‌ స్పందించారు. వంతెనల పూడికతీత పనులను దక్కించుకున్న కాంట్రాక్టర్లు, నిర్వహణ పనులను పర్యవేక్షించే ఇంజనీర్లే వీటికి కారణమని ప్రాథమికంగా నిర్ధారించారు. పాట్నాలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ విషయం వెల్లడించారు.

రాష్ట్రంలోని శివన్, సరన్, మధుబాణి, అరారియా, ఈస్ట్‌ చంపారన్, కృష్ణగంజ్‌ జిల్లాల్లో వంతెనలు కూలిపోయాయి. జూలై 3, 4 తేదీల్లో శివన్, సరన్‌ జిల్లాల్లోని గండక్‌ నదిపై నిర్మించిన ఆరు బ్రిడ్జిలు కూలిపోవడం గమనార్హం. ఈ ఘటనలపై నిపుణుల బృందాన్ని ఆయా ప్రాంతాలకు పంపించామని చైతన్య ప్రసాద్‌ తెలిపారు. శుక్రవారం నాటికి నివేదిక పంపాలని ఆదేశించామని చెప్పారు.

ఇక కూలిపోయిన వంతెన స్థానంలో కొత్తవి నిర్మిస్తామని, ఆ భారాన్ని కాంట్రాక్టరుపైనే మోపుతామని చైతన్య ప్రసాద్‌ వెల్లడించారు. ఇటీవల కూలిపోయిన వంతెనలన్నీ దాదాపు 30 ఏళ్ల క్రితం నాటివని, పునాదులు లోతుగా లేకపోవడంతో పూడిక తీత సమయంలో దెబ్బతిని కూలిపోయి ఉండొచ్చని ఆయన అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా 30 ఏళ్లకు పైబడిన వంతెనలన్నిటినీ పరిశీలించి, అవసరమైన మరమ్మతులు చేస్తామని చెప్పారు.

మరోపక్క వంతెనలు కూలిన ఘటనలకు నితీశ్‌కుమార్‌ నేతృత్వంలోని ప్రభుత్వమే జవాబుదారీ వహించాలని ఆర్జేడీ డిమాండ్‌ చేస్తోంది. జూన్‌ 18 నుంచి ఇప్పటి వరకు 12 వంతెనలు కూలిపోయినా ప్రధాని మోడీ గానీ, ముఖ్యమంత్రి నితీశ్‌ గానీ పెదవి విప్పలేదని విమర్శిస్తోంది. ఆర్జేడీ నేత, మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్‌ దీనిపై స్పందిస్తూ.. ఇప్పుడు అవినీతి రహిత ప్రభుత్వానికి ఏమైంది.. రాష్ట్ర ప్రభుత్వంలోని ప్రతి శాఖలో అవినీతి ఎంతలా రాజ్యమేలుతోందో చెప్పడానికి ఈ ఘటనలే నిదర్శనం అని విమర్శించారు.

First Published:  5 July 2024 8:49 AM IST
Next Story