Telugu Global
National

ఆ కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్ణయాలన్నీ వివాదాస్పదమే!

'టాయిలెట్‌ సీట్‌ ట్యాక్స్‌'తో వార్తల్లో నిలిచిన హిమాచల్‌ ప్రభుత్వం

ఆ కాంగ్రెస్‌ సర్కార్‌ నిర్ణయాలన్నీ వివాదాస్పదమే!
X

టాయిలెట్‌ సీట్‌ ట్యాక్స్‌.. వినడానికే వింతగా ఉంది కదూ! అలాంటి ట్యాక్స్‌ వసూలు చేయాలని ఒక రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది. ఆ ట్యాక్స్‌ పై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఎదురవుతుంది. ఇక నెటిజన్లు యథావిధిగా ఆ ప్రభుత్వాన్ని ఓ ఆట ఆడేసుకుంటున్నారు. కాంగ్రెస్‌ నేతృత్వంలోని ఆ ప్రభుత్వం తీసుకున్న అనేక నిర్ణయాలు ఇలాగే వివాదాస్పదం అయ్యాయి. ఒక్కోసారి ఆ సర్కారు నిర్ణయాలు కాంగ్రెస్‌ పార్టీకి ఇతర రాష్ట్రాల్లో రాజకీయ ఇబ్బందులు కూడా తెచ్చి పెడుతున్నాయి. హిమాచల్‌ ప్రదేశ్‌ లోని అర్బన్‌ హ్యాబిటేషన్లు (మున్సిపాలిటీలు, కార్పొరేషన్లలో) ఒక్కో టాయిలెట్‌ సీట్‌ కు రూ.25 చొప్పున ట్యాక్స్‌ వసూలు చేయాలని ప్రభుత్వం నోటిఫికేషన్‌ ఇచ్చింది. ఒక్కో ఇంట్లో ఎన్ని టాయిలెట్లు ఉంటే అన్నింటికీ ట్యాక్స్‌ లు చెల్లించాల్సిందేనని తేల్చిచెప్పింది. టాయిలెట్‌ ట్యాక్స్‌ సిగ్గుమాలిన చర్య అని బీజేపీ విమర్శలకు దిగింది.

హిమాచల్‌ లోని సుఖ్విందర్‌ సింగ్‌ సుఖు ప్రభుత్వం కాసుల కటకటతో విలవిల్లాడుతోంది. ఈక్రమంలోనే గంజాయి సాగుకు గ్రీన్‌ సిగ్నల్‌ ఇచ్చి ఖజానా నింపుకునే ప్రయత్నం చేసి వివాదాల్లో ఇరుక్కుంది. ప్రతి ఇంటికి సరఫరా చేస్తున్న నీటికి ట్యాక్స్‌ వసూలు చేయాలని ఇప్పటికే ఆదేశాలు ఇచ్చింది. ఆ నీటి బిల్లులో 30 శాతం మురుగు నీటి బిల్లు అని పేర్కొనడంతో ప్రభుత్వంపై విమర్శలు వెల్లువెత్తాయి. సొంత నీటి వనరులు ఉపయోగించుకునే కుటుంబాలు మురుగునీటి ట్యాక్స్‌ రూపేణ ఒక్కో టాయిలెట్‌ సీట్‌ కు రూ.25 చొప్పున పన్ను చెల్లించాలని నోటిఫికేషన్‌ లో పేర్కొంది. టాయిలెట్‌ సీట్‌ ట్యాక్స్‌ పై కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి స్పందించారు. కేంద్ర ప్రభుత్వం పారిశుధ్య నిర్వహన, స్వచ్ఛతను ఉద్యమంలా ముందుకు తీసుకెళ్తుంటే టాయిలెట్‌ సీట్‌ ట్యాక్స్‌ ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు. అన్నివర్గాల నుంచి ఎదురుదాడితో ఉక్కిరిబిక్కిరి అయిన హిమాచల్‌ సర్కార్‌ టాయిలెట్‌ సీట్‌ ట్యాక్స్‌ వార్తల్లో వాస్తవం లేదని వివరణ ఇచ్చింది. ఇటీవల తాము ఇచ్చిన నోటిఫికేషన్‌ కేవలం నీటి పన్నుకు సంబంధించినది మాత్రమేనని చెప్తూ డ్యామేజ్‌ కంట్రోల్‌ కు ప్రయత్నించింది.

First Published:  4 Oct 2024 6:29 PM IST
Next Story