Telugu Global
National

ఎన్నికల తర్వాత జమ్ముకశ్మీర్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎక్కువ అధికారాలు

2019 పునర్విభజన చట్టం ప్రకారం ఎన్నికైన ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం నియమితులైన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ కే ఎక్కువ అధికారాలు

ఎన్నికల తర్వాత జమ్ముకశ్మీర్‌లో లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎక్కువ అధికారాలు
X

జమ్ముకశ్మీర్‌ ఎన్నికల తర్వాత కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్నది. అయితే ఎన్నికైన ప్రభుత్వం కంటే కేంద్ర ప్రభుత్వం నియమితులైన లెఫ్టినెంట్‌ గవర్నర్‌ (ఎల్‌జే)కే ఎక్కువ అధికారాలు ఉంటాయి. కొత్త ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి.జమ్ముకశ్మీర్‌ పునర్విభజన చట్టం ప్రకారం.. అధికారాల విషయంలో నూతన ప్రభుత్వంపై లెఫ్టినెంట్‌ గవర్నర్‌ దే పైచేయిగా ఉండనున్నది.జమ్ముకశ్మీర్‌కు స్వయంప్రతిపత్తి కల్పించే ఆర్టికల్‌ 370 రద్దు అనంతరం మొదటిసారి జరుగుతున్న శాసనసభ ఎన్నికలు కేంద్రపాలిత ప్రాంతానికి కీలకం కానున్నాయి. 2019 పునర్విభజన చట్టం ప్రకారం జమ్ముకశ్మీర్‌ రెండు కేంద్ర పాలిత ప్రాంతాలుగా మారింది.

కొత్తగా ఏర్పాటుకానున్న జమ్ముకశ్మీర్‌ శాసనసభకు ఈ చట్టం ప్రకారం పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. గతంలో ఉన్న శాసనసభ వలె కాకుండా లెఫ్టినెంట్‌ గవర్నర్‌ ఎక్కువ అధికారాలు కలిగి ఉంటారని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ఆయనకే కార్యనిర్వాహక అధికారాలు ఉండనున్నాయి. మరో విధంగా చెప్పాలంటే కేంద్ర పాలిత ప్రాంతంలో ముఖ్యమంత్రికి తక్కువ అధికారాలుంటాయని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. కొత్తగా ఏర్పడే ప్రభుత్వం చట్టాలు చేయడానికి లేదా చట్టాలు మార్చడానికే కాకుండా చాలా అధికారాలు వినియోగించడానికి గవర్నర్‌ అనుమతి తప్పకుండా తీసుకోవాలి. పునర్విభజన చట్టం సెక్షన్‌ 53 ప్రకారం బ్యూరోక్రసీ, అవినీతి నిరోధక విభాగాలపై ఆయనకే అధికారం ఉంటుంది. సెక్షన్‌ 32 ప్రకారం పబ్లిక్‌ ఆర్డర్‌, పోలీస్‌ విభాగాలపైనా కొత్త ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు ఉంటాయి. అలాగే సెక్షన్‌ 36 ప్రకారం ఆర్థిక బిల్లులను శాసనసభలో ప్రవేశపెట్టడానికి ముందుగా ఎల్‌జే అనుమతి పొందాల్సి ఉంటుంది.

అడ్వకేట్‌ జనరల్‌, న్యాయ అధికారులను నియమించే విచక్షణాధికారం కూడా ఆయనకే ఉంటుంది. ఢిల్లీ, పుదుచ్చేరి మాదిరిగానే ఉంటుంది. శాంతిభద్రతల అంశంపై ఎన్నికైన ప్రభుత్వానికి పరిమితమైన అధికారాలు మాత్రమే ఉంటాయి. ఢిల్లీ తరహాలోనే ఎన్నికైన ప్రభుత్వానికి లెఫ్టినెంట్‌ గవర్నర్‌కు మధ్య అధికారాల విభజన ఉంటుంది. అయితే ఎల్‌జే ఎక్కువ అధికారాలు ఉంటాయి. ఒకవేళ జమ్ముకశ్మీర్‌లో బీజేపీ యేతర ప్రభుత్వం ఏర్పాటైతే ఢిల్లీలో ఆప్‌ ప్రభుత్వం ఎదుర్కొంటున్న సవాళ్లే ఇక్కడ కూడా ఎదురయ్యే అవకాశం ఉన్నదని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

First Published:  21 Sept 2024 5:30 AM GMT
Next Story