ఝార్ఖండ్‌లో ఎన్డీఏ పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి!
బీజేపీ 68 చోట్ల, ఏజేఎస్‌యూ పార్టీకి 10, జేడీయూకు 2, ఎల్‌జేపీకి 1 స్థానాన్ని కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు అసోం సీఎం హిమంత బిశ్వశర్మ వెల్లడి
ఝార్ఖండ్‌లో ఎన్డీఏ భాగస్వామ్య పక్షాల మధ్య సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చింది. మొత్తం 81 స్థానాలున్న ఆ రాష్ట్రంలో సీట్ల సర్దుబాటు ప్రకారం బీజేపీ 68 చోట్ల, ఏజేఎస్‌యూ పార్టీకి 10, జేడీయూకు 2, ఎల్‌జేపీకి 1 స్థానాన్ని కేటాయించాలని ప్రాథమికంగా నిర్ణయించినట్లు ఝార్ఖండ్ అసెంబ్లీ ఎన్నికల బీజేపీ కో ఇన్ ఛార్జ్, అసోం సీఎం హిమంత బిశ్వశర్మ తెలిపారు. అయితే అధికార జార్ఖండ్ ముక్తి మోర్చా (జేఎంఎం) సహా ప్రత్యర్థి పార్టీలు ఇంకా తమ ప్రణాళికలు వెల్లడించలేదు. దీంతో బీజేపీ కూడా వేచి చూసే ధోరణిని అవలంబిస్తున్నది. ఈ క్రమంలోనే సీట్ల సర్దుబాటు చర్చలు ఇంకా కొనసాగుతున్నాయని, తర్వాత సీట్ల సర్దుబాటులో మార్పులు ఉండొచ్చని హిమంత తెలిపారు.
ఇదిలా ఉండగా.. ఝార్ఖండ్‌లో మొదటి విడత పోలింగ్ జరిగే 43 స్థానాలకు ఎన్నికల సంఘం శుక్రవారం నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. శుక్రవారం నుంచి ఈ నెల 25 వరకు నామినేషన్లు స్వీకరిస్తారు. ఈ నెల 28న నామినేషన్లు పరిశీలిస్తారు. 30 వరకు నామినేషన్ల ఉపసంహరణకు గడువు ఉన్నది. రెండో దశలో నామినేషన్ల పరిశీలనకు అక్టోబర్ 30, నామిననేషన్ల ఉపసంహరణకు నవంబర్ 1 వరకు తుది గడువు ఉన్నది. రెండో విడత పోలింగ్ నవంబర్ 20న జరగనున్నది. నవంబర్ 23న ఫలితాలు వెలువడుతాయి.