యూట్యూబర్‌గా మారిన మాజీ మంత్రి
ఎన్నికల్లో ఓటమి తర్వాత నిరుద్యోగ నేత' అనే పేరుతో యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన సౌరభ్ భరద్వాజ్
![యూట్యూబర్‌గా మారిన మాజీ మంత్రి యూట్యూబర్‌గా మారిన మాజీ మంత్రి](https://www.teluguglobal.com/h-upload/2025/02/13/1403012-saurabh-bharadwaj.webp)
దేశ రాజధాని ఢిల్లీలో ఇటీవల జరిగిన ఎన్నికల్లో ఆమ్ ఆద్మీ పార్టీ ఓటమిపాలైన విషయం విదితమే. ఆ పార్టీ జాతీయ కన్వీనర్ సహా కీలక నేతలంతా పరాజయం పాలయ్యారు. ఈ క్రమంలోనే ఆప్ నేత, మాజీ మంత్రి సౌరభ్ భరద్వాజ్ యూట్యూబర్‌గా మారారు. 'నిరుద్యోగ నేత' అనే పేరుతో ఆయన ఓ యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించారు.
ఢిల్లీలోని గ్రేటర్ కైలాశ్ నుంచి పోటీ చేసిన ఆయన బీజేపీ అభ్యర్థి శిఖారాయ్ చేతిలో ఓడిపోయారు. తాజాగా యూట్యూబ్ ఛానెల్‌ను ప్రారంభించిన ఆయన 58 సెకన్ల నిడివి గల ఓ వీడియోను అప్‌లోడ్ చేశారు. అందులో 'ఎన్నికల ఫలితాలతో నా జీవితం తారుమారవడంతో నిరుద్యోగ నేతగా మిగిలిపోయాను. ఈ ఫలితాలు నాతో పాటు ఎందరో నేతలను నిరుద్యోగులుగా మార్చేశాయి. ఈ వేదిక ద్వారా ఓడిపోయిన తర్వాత రాజకీయ నాయకుడి జీవితంలోని పరిస్థితులను మీతో పంచుకుంటాను. ప్రజలు తమ మెసేజ్‌లను నాతో పంచుకోవచ్చు. మీ ప్రశ్నలకు సమాధానం ఇవ్వడానికి ప్రయత్నిస్తానని ఆయన పేర్కొన్నారు.
గ్రేటర్ కైలాశ్ నుంచి మూడుసార్లు ఎమ్మెల్యేగా ఎన్నికైన భరద్వాజ్.. గృహ ఆరోగ్య, వాటర్, ఇండస్ట్రియల్ వంటి శాఖలకు మంత్రిగా పనిచేశారు. తాజాగా జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో 3 వేల ఓట్ల తేడాతో బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలయ్యారు.