Telugu Global
National

ఢిల్లీలో ఒంటరి పోరుకే 'ఆప్‌' సై

ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ పొత్తులకు దూరంగా ఉంటుంది. ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నదన్న ఆప్‌ జాతీయ కన్వీనర్‌ కేజ్రీవాల్‌

ఢిల్లీలో ఒంటరి పోరుకే ఆప్‌ సై
X

వచ్చే ఏడాది ఫిబ్రవరిలో ఢిల్లీలో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో ఆమ్‌ ఆద్మీ పార్టీ కీలక నిర్ణయం తీసుకున్నది. ఇండియా కూటమితో తాము పొత్తుకు సిద్ధంగా లేమని.. ఒంటరిగానే పోటీ చేస్తామని ప్రకటించింది. ఈ మేరకు ఆప్‌ జాతీయ కన్వీనర్‌ అరవింద్‌ కేజ్రీవాల్‌ ప్రకటించారు. ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల్లో ఆప్‌ పొత్తులకు దూరంగా ఉంటుంది. ఒంటరి పోరుకు సిద్ధమౌతున్నదని విలేకర్ల సమావేశంలో కేజ్రీవాల్‌ కుండబద్దలు కొట్టారు. ఆప్‌ అధినేత చేసిన ప్రకటనతో ప్రతిపక్ష ఇండియా కూటమికి ఎదురుదెబ్బ తగిలినట్లు రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ ఏడాది లోక్‌సభ ఎన్నికల సమయంలోనూ పంజాబ్‌లో కాంగ్రెస్‌తో పొత్తునకు ఆప్‌ నిరాకరించిన విషయం విదితమే. 13 స్థానాల్లో ఒంటరిగానే బరిలోకి దిగింది. హర్యానాలో ఆప్‌, కాంగ్రెస్‌ల మధ్య పొత్తు బెడిసి కొట్టిన సంగతి తెలిసిందే. సీట్ల సర్దుబాటు చర్చలు విఫలం కావడంతో ఇరు పార్టీలు ఒంటరిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో ఎగ్జిట్‌పోల్స్‌ అంచనాలకు భిన్నంగా కాంగ్రెస్‌ ఓటమిపాలు కాగా.. ఆప్‌ కనీసం ఖాతా కూడా తెరవలేకపోయింది. దీనికితోడు మహారాష్ట్ర అసెంబ్లీ ఫలితాలు ప్రతికూలంగా రావడానికి కాంగ్రెస్‌ పార్టీనే కారణమనే అభిప్రాయాన్ని ఇండియా కూటమిలోని భాగస్వామ్య పార్టీల నేతలు విమర్శిస్తున్నారు.ఈ నేపథ్యంలోనే ఢిల్లీలో ఒంటరిగానే ఎన్నికలకు వెళ్లాలని ఆప్‌ నిర్ణయించుకున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

మరోవైపు ఇటీవల సమావేశమైన కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ వచ్చే ఏడాది జరిగే ఢిల్లీ, బీహార్‌ అసెంబ్లీ ఎన్నికలకు సన్నాహాలు మొదలుపెట్టాలని నిర్ణయించింది. అలాగే ఢిల్లీ ఎన్నికలకు సంబంధించి పొత్తుల కోసం సంప్రదింపు జరపాలని తీర్మానించింది. పొత్తులు కుదరకపోతే ఒంటరిగానే పోటీ చేస్తామని కాంగ్రెస్‌ పార్టీ ఇప్పటికే ప్రకటించింది. ఈ క్రమంలోనే ఆప్‌ కూడా ఒంటరిపోరకు సిద్ధమని ప్రకటన చేయడం గమనార్హం. కాగా.. దక్షిణ ఢిల్లీలోని మాలవీయనగర్‌లో పాదయాత్ర నిర్వహిస్తున్న కేజ్రీవాల్‌పై ఒక వ్యక్తి దాడికి పాల్పడటం సంచలనం సృష్టించింది. మెరుపు వేగంతో స్పందించిన భద్రతా సిబ్బంది అతడిని అడ్డుకోవడంతో ప్రమాదం తప్పింది.

దీనిపై కేజ్రీవాల్‌ స్పందిస్తూ.. అసలు నేను చేసిన తప్పు ఏమిటి? ఢిల్లీ శాంతిభద్రత అంశాన్ని లేవనెత్తాను. కేంద్ర హోం మంత్రి అమిత్‌ షా ఈ విషయంలో చర్యలు తీసుకుంటారని ఆశించాను. కానీ దానికి బదులు పాదయాత్రలో నాపైనే దాడి జరిగింది. ఓ వ్యక్తి నాపై లిక్విడ్‌ చల్లాడు. అది ప్రమాదకరం కాదు కానీ హానికరం కావొచ్చు. మేము ప్రజా సమస్యలు లేవనెత్తాం. మీకు వీలైతే.. గ్యాంగ్‌స్టర్లను అరెస్టు చేయించండి. అంతేగాని మమ్మల్ని ఎందుకు లక్ష్యంగా చేసుకున్నారని ప్రశ్నించారు.

First Published:  1 Dec 2024 2:05 PM IST
Next Story