కుంభమేళాలో 60 కోట్ల మంది పుణ్యస్నానాలు
జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యోగి వెల్లడి

పవిత్ర త్రివేణి సంగమంలో పుణ్యస్నానం ఆచరించిన వారి సంఖ్య 60 కోట్లకు చేరిందని యూపీ సీఎం యోగి ఆదిత్యనాథ్ తెలిపారు. జనవరి 13 నుంచి ఫిబ్రవరి 22 మధ్య 60 కోట్ల మంది పుణ్యస్నానాలు ఆచరించారని యోగి వెల్లడించారు. 'మహాకుంభ్ నిర్వహణ ఒక్కటి చాలు.. యూపీ ప్రభుత్వ సామర్థ్యం ఏమిటో చెప్పడానికి. మహాకుంభ్ శక్తిని యావత్ ప్రపంచం కీర్తిస్తున్నది. అభివృద్ధిని కోరుకోనివారు, దేశ సామర్థ్యంపై నమ్మకం లేనివారు కుంభమేళాపై బురదజల్లే ప్రయత్నం చేస్తున్నారని యోగి విమర్శించారు.
ప్రతీ 12 ఏళ్లకు ఒకసారి నిర్వహించే ఈ మహాకుంభమేళా జనవరి 13న మొదలుకాగా... ఫిబ్రవరి 26 వరకు కొనసాగనున్నది. మొత్తం 40 నుంచి 50 కోట్ల మంది రావొచ్చని మొదట అంచనా వేశారు. కానీ ప్రపంచం నలుమూలల నుంచి నిత్యం సరాసరి కోటిన్నర మంది వరకు వస్తున్నారు. జనవరి 29న మౌని అమావాస్య రోజే సుమారు 8 కోట్ల మంది ప్రయాగ్‌రాజ్‌కు వచ్చినట్లు యూపీ ప్రభుత్వం పేర్కొన్నది. ఈ ఆధ్యాత్మిక కార్యక్రమం మరో నాలుగు రోజల్లో ముగియనుండటంతో భక్తులు భారీగా తరలివస్తున్నారు.