హిమాచల్‌లో మెరుపు వరదలు.. దాదాపు 50 మంది గల్లంతు
డ్రోన్ టెక్నాలజీని సైతం వారి ఆచూకీ కోసం వినియోగిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఊహించని విధంగా ఒక్కసారిగా పోటెత్తిన వరదల ప్రభావానికి రోడ్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి.
హిమాచల్ ప్రదేశ్‌లో ఊహించని స్థాయిలో వచ్చిన వరదలు తీవ్ర కల్లోలాన్ని సృష్టించాయి. కుంభవృష్టిగా వర్షాలు కురవడంతో వరదలు పోటెత్తాయి. ఒక్కసారిగా పోటెత్తుతున్న వరద ప్రభావానికి పలుచోట్ల పెద్ద పెద్ద భవంతులు సైతం కుప్పకూలిపోతున్నాయి. దీంతో శిమ్లా జిల్లా రాంపూర్ ప్రాంతంలోని సమేజ్ ఖాడ్ వద్ద వరదల ఉధృతి వల్ల దాదాపు 50 మంది గల్లంతయ్యారు. వారి ఆచూకీ కోసం ఎస్‌డీఆర్‌ఎఫ్, ఎన్‌డీఆర్‌ఎఫ్, ఇండో టిబెటన్ సరిహద్దు పోలీసులు, పోలీసులు, హోంగార్డులు సహా ఇతర సహాయక సిబ్బంది రంగంలోకి దిగారు.
గల్లంతైన వారి కోసం సహాయక బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపడుతున్నాయని డిప్యూటీ కమిషన్ అనుపమ్ కశ్యప్ వెల్లడించారు. డ్రోన్ టెక్నాలజీని సైతం వారి ఆచూకీ కోసం వినియోగిస్తున్నట్టు ఆయన తెలిపారు. ఊహించని విధంగా ఒక్కసారిగా పోటెత్తిన వరదల ప్రభావానికి రోడ్లన్నీ తుడిచిపెట్టుకుపోయాయి. ఓ జల విద్యుత్తు కేంద్రం తీవ్రంగా దెబ్బతింది. పెద్ద సంఖ్యలో ఇళ్లు దెబ్బతిన్నాయి. ఆస్తి నష్టం ఎక్కువే ఉంటుందని అధికారులు చెబుతున్నారు.