Telugu Global
National

మా నాన్నను అరెస్టు చేయండి.. పోలీసులకు ఐదేళ్ల బాలుడి ఫిర్యాదు

ఇక్బాల్ ను అరెస్టు చేసి జైల్లో పెడతానని సదరు పోలీసు అధికారి హామీ ఇవ్వడంతో ఆ బాలుడు అక్కడి నుంచి వెనుదిరిగాడు.

మా నాన్నను అరెస్టు చేయండి.. పోలీసులకు ఐదేళ్ల బాలుడి ఫిర్యాదు
X

'మా నాన్న నన్ను ఆడుకోనివ్వడం లేదు. ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపండి' అంటూ ఓ ఐదేళ్ల బాలుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. మధ్యప్రదేశ్ రాష్ట్రం ధార్ జిల్లాకు చెందిన హసనైన్ అనే ఐదేళ్ల బాలుడు ఇటీవల ఏడుస్తూ పోలీస్ స్టేషన్ కు వచ్చాడు. అతడిని చూసిన పోలీసు అధికారి ఏమైందంటూ.. ప్రశ్నించాడు. దీంతో ఆ బాలుడు తన తండ్రి ఇక్బాల్ పై ఫిర్యాదు చేసేందుకు వచ్చినట్లు తెలిపాడు.

ఇక్బాల్ ఏ తప్పు చేశారని పోలీస్ అధికారి ప్రశ్నించగా.. తన తండ్రి రోజు తనను కొడుతున్నట్లు తెలిపాడు. 'మా నాన్న నన్ను ఇంటి పక్కనే ఉన్న నదిలో స్నానం చేసేందుకు పంపట్లేదు. ఆడుకోవడానికి వెళ్ళనివ్వడం లేదు. రోడ్డు వైపు వెళ్లకుండా ఆపుతున్నాడు. కొడుతున్నాడు' అంటూ పోలీసు అధికారికి బాలుడు ఫిర్యాదు చేశాడు. తన తండ్రిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపాలని పోలీసు అధికారిని కోరాడు.


ఇక్బాల్ ను అరెస్టు చేసి జైల్లో పెడతానని సదరు పోలీసు అధికారి హామీ ఇవ్వడంతో ఆ బాలుడు అక్కడి నుంచి వెనుదిరిగాడు. కాగా, బాలుడు పోలీసు అధికారితో మాట్లాడుతున్న సమయంలో స్టేషన్లో ఉన్న కొందరు దానిని వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. ఈ వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. పోలీస్ స్టేషన్ కి వెళ్లి తన తండ్రిపై ఫిర్యాదు చేసిన బుడ్డోడి ధైర్యాన్ని అందరూ ప్రశంసిస్తున్నారు.

కాగా, ఇటీవలి కాలంలో చిన్నారులు పోలీస్ స్టేషన్ల మెట్లు ఎక్కడం సాధారణంగా మారిపోయింది. తరగతి గదిలో తన పెన్సిల్ ను స్నేహితుడు దొంగిలించాడని.. అతడిపై చర్యలు తీసుకోవాలని కర్నూలు జిల్లాకు చెందిన ఓ బాలుడు కొన్ని రోజుల కిందట పోలీసులకు ఫిర్యాదు చేసిన సంగతి తెలిసిందే. మరో సంఘటనలో సిద్దిపేట జిల్లాకు చెందిన బాలుడు తన సైకిల్ చోరీకి గురైందని వెతికి పెట్టాలని నేరుగా పోలీస్ స్టేషన్ కు వెళ్లి ఫిర్యాదు చేశాడు.

First Published:  21 Aug 2024 12:07 PM GMT
Next Story