యూట్యూబ్‌లో చూసి బాంబ్ తయారుచేయబోయి.. ఐదుగురు చిన్నారులకు గాయాలు
టార్చ్‌కి బ్యాటరీని కనెక్ట్ చేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆ చిన్నారులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
యూట్యూబ్‌లో చూసి ఐదుగురు చిన్నారులు బాంబ్ తయారు చేసేందుకు ప్రయత్నించిన ఘటన తాజాగా వెలుగు చూసింది. బాంబ్ తయారు చేసే క్రమంలో అది అకస్మాత్తుగా పేలడంతో చిన్నారులకు గాయాలయ్యాయి. బిహార్‌లో ఈ ఘటన చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.
బిహార్‌లోని ముజఫర్‌పూర్‌లో ఐదుగురు చిన్నారులు యూట్యూబ్‌లోని వీడియోలు చూసి బాంబ్ తయారు చేయాలనుకున్నారు. ఇందుకోసం అగ్గిపుల్లల నుంచి గన్ పౌడర్ తీసి టార్చ్‌లైట్‌లో అమర్చారు. అనంతరం టార్చ్‌కి బ్యాటరీని కనెక్ట్ చేయడంతో ఒక్కసారిగా పేలుడు సంభవించింది. ఈ ఘటనలో ఐదుగురు చిన్నారులకు గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆ చిన్నారులను ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు.
ఆ చిన్నారుల్లో ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మిగిలినవారికి ముఖం, శరీర భాగాలకు గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఇలాంటి ఘటనలను నివారించేందుకు పిల్లల ఆన్‌లైన్ కార్యకలాపాలను తల్లిదండ్రులు ఎప్పటిప్పుడు పర్యవేక్షించాలని పోలీసులు సూచించారు.